కార్ల టోకు విక్రయాలు 4% పెరిగాయ్‌: సియామ్‌

గత నెలలో దేశీయంగా ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 4% పెరిగాయని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ మంగళవారం వెల్లడించింది.

Published : 12 Jun 2024 02:57 IST

దిల్లీ: గత నెలలో దేశీయంగా ప్రయాణికుల వాహన (పీవీ- కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) టోకు విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 4% పెరిగాయని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్‌ మంగళవారం వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో వాహన తయారీ సంస్థల నుంచి డీలర్లకు మొత్తం 3,47,492 వాహనాలను సరఫరా చేశాయని పేర్కొంది. 2023 మేలో 3,34,537 పీవీలు సరఫరా అయ్యాయి. ఇప్పటి వరకు చూస్తే, మే నెలలో ఈ స్థాయిలో వాహనాల సరఫరా జరగడం ఇదే తొలిసారని, వినియోగ వాహనాల (యుటిలిటీ వెహికల్స్‌)కు గిరాకీ బాగుండటం కలిసొచ్చిందని వెల్లడించింది. మారుతీ సుజుకీ సరఫరాలు 1,43,708 నుంచి 1,44,002కు చేరాయి. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వాహన విక్రయాలు 48,601 నుంచి 49,151కు పెరిగాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా టోకు సరఫరాలు 32,886 నుంచి 43,218కు చేరాయి. ‘ప్రయాణికుల వాహనాలతో పాటు, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాలన్నీ మేలో వృద్ధిని నమోదు చేశాయ’ని సియామ్‌ అధ్యక్షుడు వినోద్‌ అగర్వాల్‌ వెల్లడించారు. సాధారణ వర్షపాత అంచనాలకు తోడు, కొత్త ప్రభుత్వం వికసిత భారత్‌ దిశగా అడుగులు వేస్తుండటం వంటివి వాహన పరిశ్రమ స్థిర వృద్ధికి దోహదం చేస్తాయని, 2024-25 ఆర్థిక సంవత్సరంపై ఆశావాద దృక్పథంతో ఉన్నామని వినోద్‌ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని