ఆద్యంతం ఒడుదొడుకులు

రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ స్తబ్దుగా ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 83.59 వద్ద ముగిసింది.

Published : 12 Jun 2024 03:08 IST

సమీక్ష

రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీ స్తబ్దుగా ముగిశాయి. సూచీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు తగ్గి 83.59 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.32% నష్టంతో 81.37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో లాభపడగా, షాంఘై, హాంకాంగ్‌ నష్టపోయాయి.  

సెన్సెక్స్‌ ఉదయం 76,680.90 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడింగ్‌లో తడబడిన సూచీ, 76,296.44 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అనంతరం కోలుకుని లాభాల్లోకి వచ్చి 76,860.53 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో, 33.49 పాయింట్ల నష్టంతో 76,456.59 వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం 5.65 పాయింట్లు పెరిగి 23,264.85 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,206.65- 23,389.45 పాయింట్ల మధ్య కదలాడింది. 

  •  సెన్సెక్స్‌ 30 షేర్లలో 14 డీలాపడ్డాయి. కోటక్‌ బ్యాంక్‌ 1.44%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.18%, ఐటీసీ 0.95%, రిలయన్స్‌ 0.92%, సన్‌ఫార్మా 0.86%, యాక్సిస్‌ బ్యాంక్‌ 0.55% నష్టపోయాయి. ఎల్‌ అండ్‌ టీ 1.64%, టాటా మోటార్స్‌ 1.26%, మారుతీ 1.24%, ఎం అండ్‌ ఎం 0.93%, అల్ట్రాటెక్‌ 0.88%, ఎన్‌టీపీసీ 0.84% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీలో టెలికాం 1.93%, చమురు-గ్యాస్‌ 1.84%, స్థిరాస్తి 1.04%, ఇంధన 1%, వాహన 0.89%, వినియోగ 0.60% మెరిశాయి. లోహ, ఎఫ్‌ఎమ్‌సీజీ, మన్నికైన వినిమయ వస్తువులు తగ్గాయి.  
  • రూ.5500 కోట్ల ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓకు సెబీ అనుమతి: ఓలా ఎలక్ట్రిక్‌ రూ.5,500 కోట్ల సమీకరణ నిమిత్తం ప్రతిపాదించిన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో  విద్యుత్‌ వాహన అంకుర సంస్థ ఐపీఓకు వస్తుండటం ఇదే తొలిసారి. సెబీ అనుమతికి సంబంధించిన సమాచారాన్ని ఓలా గ్రూప్‌ ఉద్యోగులకు కంపెనీ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ తెలియజేశారు. ఐపీఓకు అనుమతి కోరుతూ గతేడాది డిసెంబరు 22న సెబీ వద్ద ఓలా ఎలక్ట్రిక్‌ ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. ఈ ఐపీఓ కోసం కంపెనీ విలువను 6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.50,000 కోట్లు)గా పరిగణిస్తున్నట్లు సమాచారం. 
  • సెబీలో 49 మంది ఆఫీసర్ల నియామకాలు: ఈ ఏడాది పలు విభాగాల్లో 49 మంది ఆఫీసర్లను నియమించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దరఖాస్తులు ఆహ్వానించింది. మంగళవారం విడుదల చేసిన తాజా నోటీసులో సాధారణ, న్యాయ, ఐటీ, ఇంజినీరింగ్‌ ఎలక్ట్రికల్, పరిశోధన, అధికార భాషా మాధ్యమాల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌ ఏ (అసిస్టెంట్‌ మేనేజర్‌) ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. జూన్‌ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 27 నుంచి మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. గత మార్చిలో 97 సీనియర్‌ స్థాయి పదవులకు, దరఖాస్తులను ఆహ్వానించినా, సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా వేసింది. 
  • 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.201 కోట్ల బోనస్‌ను శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. ప్రీమియం ఆదాయం పెరగడం ఇందుకు దోహదపడిందని కంపెనీ తెలిపింది. ఈ బోనస్‌ చెల్లింపుతో 3.86 లక్షల మంది పాలసీదార్లకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించింది. 2022-23లో ఇచ్చిన రూ.149 కోట్ల బోనస్‌తో పోలిస్తే ఇది 35% ఎక్కువ. కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 4,46,730 పాలసీలు విక్రయించింది. కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.11,282 కోట్లుగా నమోదైంది.
  • ఇక్సిగో ఐపీఓ రెండో రోజుకు 9.31 రెట్ల స్పందన నమోదైంది. ఇష్యూలో భాగంగా 4,37,69,494 షేర్లను ఆఫర్‌ చేయగా, 40,74,46,403 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐల నుంచి 20.11 రెట్లు, రిటైల్‌ విభాగంలో 18.66 రెట్ల స్పందన కనిపించింది.
  • ఈ నెల 5న కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో 21.57 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ వెల్లడించింది. దీంతో బ్యాంక్‌లో సంస్థ వాటా 5.01 శాతానికి పెరిగింది. 
  • పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు 1.31 కోట్ల ఈక్విటీ షేర్లను బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు తమ సంయుక్త సంస్థ నేషనల్‌ హై పవర్‌ టెస్ట్‌ లేబొరేటరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌పీటీఎల్‌) బోర్డు ఆమోదం తెలిపిందని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. ఈ లావాదేవీ పూర్తయితే ఎన్‌హెచ్‌పీసీలో ఎన్‌హెచ్‌పీటీఎల్‌ వాటా 20% నుంచి 12.50 శాతానికి తగ్గుతుంది.
  • వ్యాపార వృద్ధి కోసం ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్, రైట్స్‌ ఇష్యూ లేదా క్యూఐపీ ద్వారా రూ.10,000 కోట్ల వరకు సమీకరించాలన్న ప్రతిపాదనకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డు ఆమోదం తెలిపింది. 
  • బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌లో 5% వాటాను రూ.1,920 కోట్లకు నెదర్లాండ్స్‌ సంస్థ ఫెర్రోవియల్‌ విక్రయించింది. ఈ లావాదేవీ తర్వాత కంపెనీలో ఫెర్రోవియల్‌ వాటా 24.86% నుంచి 19.86 శాతానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా షేరు 5.72% నష్టపోయి రూ.66.14 వద్ద ముగిసింది.
  • రుణ బకాయిలు చెల్లించడానికి జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ ఇచ్చిన వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా ఐసీఐసీఐ బ్యాంక్‌ను నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన దివాలా పరిష్కార ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీని జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌ ఆశ్రయించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను జూన్‌ 24కు వాయిదా వేసింది. 
  • ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌లో 1.99% వాటాకు సమానమైన షేర్లను, ఆ సంస్థ ప్రమోటర్‌ రాహుల్‌ భాటియాకు చెందిన ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సుమారు రూ.3,367 కోట్లకు విక్రయించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు