నియామకాలు ఆశావహం

ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో మనదేశంలో నియామకాలు ఆశావహంగానే ఉంటాయని ఓ సర్వే తెలిపింది.

Published : 12 Jun 2024 03:10 IST

జులై-సెప్టెంబరులో 30% పెరగొచ్చు
మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వే

దిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో మనదేశంలో నియామకాలు ఆశావహంగానే ఉంటాయని ఓ సర్వే తెలిపింది. నియామకాలు బాగుంటాయనే అంచనాల్లో, అంతర్జాతీయంగా  భారత్‌ ఆరో స్థానంలో నిలిచిందని మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ గ్లోబల్‌ సర్వే వెల్లడించింది. వచ్చే 3 నెలల్లో తమ సిబ్బందిని పెంచుకోవాలని 30 శాతానికి పైగా సంస్థలు చూస్తున్నట్లు తెలిపింది. భారత నికర ఉద్యోగుల నియామక అంచనా (ఎన్‌ఈఓ) 30 శాతంగా ఉంది. కంపెనీల మొత్తం నియామకాల ప్రణాళికల నుంచి, తొలగింపులను తీసేసి ఎన్‌ఈఓను లెక్కిస్తారు. ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే ఇది తక్కువే. 2023 జులై-సెప్టెంబరుతో పోల్చినా 6% తగ్గింది. వచ్చే మూడు నెలల్లో నియామకాలు జరిపినా, కంపెనీలు అప్రమత్తంగా ఉండటాన్ని ఇది సూచిస్తోంది. నియామక అంచనాల్లో అంతర్జాతీయ సగటు కంటే మన సగటు 8 పాయింట్లు అధికంగా ఉంది. ఈ సర్వేను 42 దేశాల్లో నిర్వహించారు. భారత్‌లో 3,150 సంస్థలు, మూడో త్రైమాసికంలో నియామకాల అంచనాల గురించి ఇందులో తెలిపాయి.

  • జులై- సెప్టెంబరులో కోస్టారికాలో (35%) నియామకాలు బలంగా ఉండొచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్‌ (34%), గ్వాటెమాలా (32%), మెక్సికో (32%), దక్షిణాఫ్రికా (31%) ఉన్నాయి. అర్జెంటీనా, రొమేనియాల్లో ఎన్‌ఈఓ అత్యల్పంగా 3 శాతంగా ఉంది.
  • ఆసియా పసిఫిక్‌ ప్రాôతంలో చూస్తే.. భారత్‌ (30%), చైనా (28%) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నియామకాలపై అత్యంత అప్రమత్తంగా ఉన్న దేశాల్లో హాంకాంగ్‌ (8%), జపాన్‌ (12%) ఉన్నాయి. 
  • ‘భారత ఐటీ రంగంపై అంతర్జాతీయ మందగమనం ప్రభావం చూపుతోంది. సార్వత్రిక ఎన్నికల వల్ల కొంత రాజకీయ అనిశ్చితి తలెత్తింది. దీంతో స్వల్పకాలంలో కంపెనీలు ఆచితూచి వ్యవహరించడానికి మొగ్గుచూపుతున్నాయి’ అని మ్యాన్‌పవర్‌ ఇండియా, పశ్చిమాసియా ఎండీ సందీప్‌ గులాటీ పేర్కొన్నారు. భారత్‌లో నైపుణ్యాల గిరాకీ, సరఫరా మధ్య అంతరాలను కంపెనీలు దీర్ఘకాల నైపుణ్య ప్రణాళికలతో తగ్గిస్తాయని వివరించారు.
  • భారత్‌లో నియామకాల ధోరణులు చూస్తే.. ఉత్తర భారత్‌లో 36%, పశ్చిమ (31%), దక్షిణ (30%), తూర్పులో (21%)గా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే అన్ని రంగాల్లో నియామకాల సెంటిమెంట్‌ తగ్గడం గమనార్హం. 
  •  రంగాల వారీగా చూస్తే.. ఆర్థిక, స్థిరాస్తి, ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌సైన్సెస్‌ రంగాలు నియామకాల్లో మెరుగ్గా ఉన్నాయి. కమ్యూనికేషన్‌ సేవలు, రవాణా, లాజిస్టిక్స్, ఆటోమోటివ్‌ బలహీనంగా కనిపిస్తున్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని