టర్మ్‌ పాలసీ...ఇవన్నీ తెలుసుకున్నాకే...

రెండేళ్లుగా ఒక రకమైన అనిశ్చితి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఒక కచ్చితమైన ఆర్థిక భరోసాను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి జీవిత బీమా పాలసీలను ఆశ్రయిస్తున్నారు.

Updated : 24 Jun 2022 04:18 IST

రెండేళ్లుగా ఒక రకమైన అనిశ్చితి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి ఒక కచ్చితమైన ఆర్థిక భరోసాను కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి జీవిత బీమా పాలసీలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ప్రీమియంతో అధిక రక్షణ కల్పించే టర్మ్‌ పాలసీలను తమ ఆర్థిక ప్రణాళికలో భాగంగా చేసుకుంటున్నారు. ఇవి మరింత ప్రయోజనాన్ని అందించేందుకు వీటి ఎంపికలో ఏయే అంశాలు పరిశీలించాలన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

మహమ్మారి నేపథ్యంలో నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ పెరిగింది. పెట్టుబడుల గురించి, భద్రత గురించి ఆలోచిస్తున్నారని ఇటీవల కాలంలో పలు నివేదికలు తెలియజేశాయి. దురదృష్టకర సంఘటనల వల్ల కుటుంబం ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టర్మ్‌ పాలసీలు వారికి మొదటి ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పాలసీలు కొన్ని అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. కాబట్టి, పాలసీని తీసుకునేటప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీకు ఏది సరిపోతుందో చూసుకోవాలి. చెల్లించిన ప్రీమియానికి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి, ఇది పన్ను ప్రణాళికలోనూ ముఖ్యమే.

కొన్నాళ్లు ప్రీమియం చెల్లించకున్నా...
సాధారణంగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కొనసాగుతూ ఉండాలంటే.. క్రమం తప్పకుండా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. కొన్నిసార్లు వ్యవధి తీరిన తర్వాత కొన్ని రోజుల పాటు అదనపు గడువు లభిస్తుంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే.. నిబంధనల మేరకు బీమా రక్షణ దూరమవుతుంది. ఆర్థికంగా కాస్త ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది చిక్కు సమస్యే. కొత్తతరం పాలసీలు ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాయి. వైద్యపరమైన కారణాల వల్ల ఊహించని ఖర్చుల వల్ల ప్రీమియం చెల్లించలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రీమియం చెల్లింపును తాత్కాలికంగా నిలిపి వేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల దీర్ఘకాలం పాటు ఆర్థిక రక్షణ పొందాలనుకునే వారికి పాలసీదారులు.. కొంతకాలం ప్రీమియం చెల్లించకున్నా రక్షణ కొనసాగుతుంది. దీనివల్ల ప్రీమియం చెల్లించే వీలు కుదిరినప్పుడు మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత పాలసీకి ప్రీమియం చెల్లించి, దానిని తిరిగి వెలుగులోకి తీసుకురావచ్చు.


చెల్లింపు ఎలా...

పాత కాలపు టర్మ్‌ పాలసీల్లో.. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీకి వెంటనే పాలసీ విలువ మేరకు పరిహారం చెల్లించేవారు. ఇప్పుడు కొత్త పాలసీలు పరిహారం చెల్లింపు విధానాన్ని అందించడంలో వినూత్న మార్పులు చేస్తున్నాయి. బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు.. క్లెయిందారుకు 100 శాతం హామీ మొత్తాన్ని చెల్లించే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా కొన్నేళ్లపాటు నెలనెలా ఆదాయంగా చెల్లించే ఏర్పాటూ చేయొచ్చు. కొన్ని పాలసీలు.. పరిహారాన్ని కొంత ఏక మొత్తంగా చెల్లించి, మిగతాది కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా నామినీకి అందిస్తాయి. ఏక మొత్తంలో చెల్లింపుతోపాటు, ఏటా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా నెలనెలా చెల్లింపులను అధికం చేసేవీ అందుబాటులో ఉన్నాయి. పాలసీదారుడు ఏ తరహా చెల్లింపు ఉండాలనేది పాలసీతీసుకునేటప్పుడే నిర్ణయించుకోవాలి.


వద్దనుకుంటే..
గతంలో ప్రీమియం చెల్లించకపోతే.. పాలసీ రద్దయ్యేది. దీనికి ఎలాంటి ప్రత్యేక వివరణలూ ఉండేవి కావు. ఇది పాలసీదారులకు కొంత ఇబ్బంది కలిగించేదే. కొత్త పాలసీలు ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాయి. పాలసీ వ్యవధిలో కొన్నాళ్ల తర్వాత ప్రత్యేక నిష్క్రమణ వెసులుబాటును అందిస్తున్నాయి. దీనికి కొన్ని షరతులు ఉంటాయి. సాధారణంగా పాలసీదారు వయసు 65 ఏళ్లకు చేరుకున్నప్పుడు లేదా 25వ పాలసీ ఏడాదిలో (పాలసీ వ్యవధి 40-44 ఏళ్లు) లేదా 30వ పాలసీ ఏడాదిలో (పాలసీ వ్యవధి 44 ఏళ్లకు మించి) పాలసీ నుంచి బయటకు రావచ్చు. ఇలా పాలసీ నుంచి బయటకు వచ్చినప్పుడు నిబంధనల మేరకు అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియాన్ని పాలసీదారుడికి చెల్లిస్తాయి.

ప్రీమియం వెనక్కి వచ్చేలా..
టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదు.. చాలామంది పాలసీదారులు ఈ పాలసీలను తీసుకునేందుకు వెనకడుగు వేయడానికి కారణం ఇదే. సాధారణంగా పాలసీ కొనసాగుతున్న వ్యవధిలో పాలసీదారుడికి ఏదైనా జరిగితేనే పరిహారం లభిస్తుంది. పాలసీ వ్యవధి పూర్తయితే.. రూపాయి కూడా ఇవ్వదు. కానీ, ఇప్పుడు ప్రీమియం వాపసు పాలసీలూ అందుబాటులోకి వచ్చాయి. అంటే, పాలసీ వ్యవధి పూర్తయ్యాక.. అప్పటి వరకూ చెల్లించిన ప్రీమియాలు నిబంధనల మేరకు వెనక్కి ఇస్తారు. సాధారణ టర్మ్‌ పాలసీలతో పోలిస్తే వీటికి ప్రీమియం కాస్త అధికం. చిన్న వయసులో ఉన్నవారు ఈ పాలసీలను పరిశీలించవచ్చు. టర్మ్‌ పాలసీ రక్షణ, ప్రీమియం వెనక్కిలాంటి రెండు ప్రయోజనాలు ఉండటం కలిసొస్తుంది.
జీవిత బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు దీర్ఘకాలం రక్షణ కల్పించే ఏర్పాటు ఉండాలి. అంతేకానీ, స్వల్పకాలిక పెట్టుబడిగానో.. లేదా పన్ను ఆదా కోసం ఉపయోగపడే పథకంగానే దీన్ని చూడకూడదు. ప్రమాదవశాత్తూ మరణం, తీవ్ర వ్యాధులు, వైకల్యంలాంటి రైడర్లను జోడించుకోవడం వల్ల అదనపు రక్షణ పొందేందుకు వీలుంటుందని మర్చిపోవద్దు.

- వి.విశ్వానంద్‌, డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని