విదేశాల్లోనూ వైద్య చికిత్స...

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా వైద్య చికిత్స చేయించుకునేందుకు అవకాశం కల్పించే ఆరోగ్య బీమా పాలసీ గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ను బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ

Updated : 01 Jul 2022 05:46 IST

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా వైద్య చికిత్స చేయించుకునేందుకు అవకాశం కల్పించే ఆరోగ్య బీమా పాలసీ గ్లోబల్‌ హెల్త్‌ కేర్‌ను బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఈ పాలసీ బీమా రక్షణను అందిస్తుంది. ఇతర దేశాల్లో చికిత్సల సమయంలో క్లెయింల పరిష్కారం సులభతరం చేసేందుకు అలియాంజ్‌ పార్ట్‌నర్స్‌తో కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ పాలసీ రెండు రకాలుగా అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్‌ ప్లాన్‌, ఇంపీరియల్‌ ప్లస్‌ ప్లాన్‌లలో ఒకదానిని ఎంచుకోవచ్చు. ఇంపీరియల్‌ ప్లస్‌ ప్లాన్‌లో.. అధిక మొత్తం బీమాతోపాటు, ఆసుపత్రిలో చేరడానికి ముందు, ఇంటికి వెళ్లిన తర్వాత అయ్యే ఖర్చులు, ఎయిర్‌ అంబులెన్స్‌, డే కేర్‌ శస్త్రచికిత్సలు, అవయవదాతకు ఖర్చులు, ఆధునిక చికిత్స పద్ధతులు, మానసిక అనారోగ్యం, పునరావాసంలాంటి వాటికి పరిహారం ఇస్తుంది. ఆయుర్వేదం, హోమియోపతిలాంటి వైద్య విధానాలకూ ఈ పాలసీ వర్తిస్తుంది. అంతర్జాతీయ పాలసీలో.. అదనంగా దంత చికిత్స (ఐచ్ఛికం), ఓపీడీ కవర్‌, ఇన్‌ పేషెంట్‌ క్యాష్‌ బెనిఫిట్‌, బీమా చేసిన వ్యక్తి తల్లిదండ్రుల్లో ఒకరు సహాయంగా ఉండటం, ఎయిర్‌ అంబులెన్స్‌, పార్ధివ దేహం తరలింపులాంటి వాటికి బీమా వర్తిస్తుంది. ఇంపీరియల్‌ పాలసీని కనీసం రూ.37,50,000 నుంచి రూ.75,00,000 వరకూ ఎంచుకోవచ్చు. ఇంపీరియల్‌ ప్లస్‌ ప్లాన్‌ రూ.1,12,00,000 నుంచి రూ.3,75,00,000 వరకూ ఉంది. అంతర్జాతీయ పాలసీ 1,00,000 నుంచి 10,00,000 డాలర్ల వరకూ పాలసీ అందబాటులో ఉంది. 18-65 ఏళ్ల మధ్యవారు ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీదారుడిపై ఆధారపడిన పిల్లల వయసు 3 నెలల నుంచి 30 ఏళ్ల వరకూ ఉండొచ్చు. జీవితాంతం వరకూ పాలసీని పునరుద్ధరించుకోవచ్చు. ప్రీమియం రూ.39,432 నుంచి (జీఎస్‌టీ కాకుండా) మొదలవుతుంది. కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి కలిపి పాలసీ తీసుకుంటే.. ప్రీమియంలో 5 శాతం వరకూ రాయితీ లభిస్తుంది. అమెరికాను మినహాయించి, అమెరికాతో సహా అనే ఐచ్ఛికాలతో ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ఇతర దేశాల్లో చికిత్స తీసుకోవాలని తీసుకునే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ పాలసీని తీసుకొచ్చినట్లు బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ తపన్‌ సింఘేల్‌ తెలిపారు.


పదవీ విరమణలో తోడుగా..

దవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారికోసం ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త యాన్యుటీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఎస్‌బీఐ లైఫ్‌ స్మార్ట్‌ యాన్యుటీ ప్లస్‌ ఏక ప్రీమియం పథకం. వెంటనే పింఛను కావాలనుకునే వారు ఇమ్మీడియట్‌ యాన్యుటీని ఎంచుకోవచ్చు. డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌ ఎంచుకున్న వారు.. ఏడాది, రెండేళ్లు, పదేళ్ల తర్వాత పింఛను వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇమ్మీడియట్‌ యాన్యుటీతో పోలిస్తే.. డిఫర్డ్‌ యాన్యుటీ పథకం ద్వారా కాస్త అధిక మొత్తం అందుతుంది. ఉదాహరణకు 50 ఏళ్ల వ్యక్తి రూ. కోటి ప్రీమియం (పన్నులు అదనం)తో ఎస్‌బీఐ లైఫ్‌ యాన్యుటీ ప్లస్‌లో 10 ఏళ్ల డిఫర్డ్‌ యాన్యుటీ ప్లాన్‌లో యాన్యుటీ ఫర్‌ లైఫ్‌ విత్‌ రిటర్న్‌ ఆఫ్‌ పర్ఛేజ్‌ ప్రైస్‌ తీసుకున్నారనుకుందాం. 11వ ఏట నుంచి ఈ వ్యక్తి జీవితాంతం వరకూ ఏటా రూ.10,52,077 పింఛను అందుకుంటారు. ఇలా తీసుకుంటున్న వ్యక్తి తన 80 ఏళ్లకు మరణిస్తే.. రూ. కోటి నామినీకి చెల్లిస్తారు. పాలసీ ప్రారంభ తేదీ నుంచి పదేళ్లలోపు మరణిస్తే.. నామినీకి రూ.2,02,42,000 చెల్లిస్తుంది. పాలసీ ప్రారంభ తేదీ నుంచి 13వ సంవత్సరంలో మరణిస్తే నామినీకి రూ.1,70,85,769 అందుతాయి. పాలసీలో ఉన్న గ్యారంటీ అడిషన్స్‌ వల్ల ఇది సాధ్యమవుతుంది. లైఫ్‌ జాయింట్‌ లైఫ్‌ యాన్యుటీ ఆప్షన్‌లో రెండో యాన్యుటీదారుడి కింద జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, అత్తామామలు, తోబుట్టువులను అనుమతిస్తారు. మధ్యలోనే పాలసీని స్వాధీనం చేసే అవకాశమూ ఉంది. కనీసం నెలకు రూ.1,000 పింఛను వచ్చేలా పాలసీని ఎంచుకోవాలి. 60 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షలతో (పన్నులు అదనం) ఈ పాలసీలోని లైఫ్‌ యాన్యుటీని కొనుగోలు చేస్తే ఏడాదికి రూ.74,898 పింఛను అందుతుంది. అదే లైఫ్‌ యాన్యుటీ విత్‌ రిటర్న్‌ ఆఫ్‌ ప్రీమియం తీసుకుంటే.. రూ.60,215 అందుతుంది. ఎన్‌పీఎస్‌ ఖాతాదారులు యాన్యుటీ కోసం ఈ పాలసీని ఎంచుకునే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు స్థిరాదాయం అందించాలని కోరుకునే వారూ ఈ పాలసీని పరిశీలించవచ్చు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని