ఆన్‌లైన్‌లో.. ప్రణాళికలు ఇలా...

ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. కరోనా తర్వాత ఆర్థిక సేవల రంగంలో దీని పరిధి మరింత విస్తృతమయ్యింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు, పెట్టుబడులు, బీమా పాలసీల దగ్గర్నుంచి ప్రతీదీ ఆన్‌లైన్‌ బాట పట్టాయి.

Published : 01 Jul 2022 01:31 IST

ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. కరోనా తర్వాత ఆర్థిక సేవల రంగంలో దీని పరిధి మరింత విస్తృతమయ్యింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు, పెట్టుబడులు, బీమా పాలసీల దగ్గర్నుంచి ప్రతీదీ ఆన్‌లైన్‌ బాట పట్టాయి. మరి, మీ ఆర్థిక ప్రణాళికల్లోనూ డిజిటల్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామా..

డిజిటల్‌ సేవలను వినియోగించుకోవడం ద్వారా వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల్లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణకు ఇది తోడుగా నిలుస్తోందని చెప్పొచ్చు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను సమర్థంగా రూపొందించుకునేందుకూ, వాటిని ఆచరించేందుకూ సాంకేతికతను ఎలా వినియోగించుకోవాలన్నది ముఖ్యం.

బడ్జెటింగ్‌ యాప్‌లతో..: భవిష్యత్‌ కోసం పెట్టుబడులు పెట్టాలంటే.. వచ్చిన ఆదాయాన్ని స్మార్ట్‌గా ఖర్చు చేయాలి. ప్రతి రూపాయి ఖర్చుకూ పద్దు రాయాలి. ఇది ఖర్చుల పుస్తకంలో రాయడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. కానీ, చేతిలో ఉండే మొబైల్‌లో ఈ పనిని సులభంగా చేయొచ్చు. ఇప్పుడు ఎన్నో యాప్‌లు దీనికోసం అందుబాటులో ఉన్నాయి. నమ్మకమైన సంస్థ రూపొందించిన బడ్జెటింగ్‌ యాప్‌లో మీ ఆదాయ, వ్యయాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవచ్చు. కొన్ని యాప్‌లు నేరుగా మీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా ఖర్చు చేసిన మొత్తాలను నమోదు చేస్తుంటాయి. ఇలాంటి యాప్‌ల విషయంలో కాస్త అప్రమత్తత అవసరం.

పెట్టుబడుల కోసం..: క్రమశిక్షణతో మదుపు చేయడం ఎప్పుడూ అవసరం. కొంతమంది ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి వారు ఆన్‌లైన్‌ మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకున్న పెట్టుబడులకు మీరు నెలనెలా డబ్బును బదిలీ చేయాల్సిన అవసరం లేకుండా.. బ్యాంకులకు స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇవ్వాలి. మీ ఖాతా నుంచి నేరుగా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడులకు వెళ్లే ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. మీ వేతనం జమ అయ్యే తేదీకి ఒకటి రెండు రోజుల తర్వాత ఇది జరిగేలా చూసుకోవాలి. దీనివల్ల ఖర్చులకన్నా ముందే పెట్టుబడులకు డబ్బు వెళ్తుంది. సిప్‌, బీమా పాలసీల ప్రీమియాలు సకాలంలో చెల్లించేందుకు ఇది సరైన మార్గం.

రాయితీలూ ఉంటాయి: ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించడం ఎంతో సులువు. యూపీఐ ద్వారా నిత్యావసరాల కొనుగోలుకు చెల్లింపులు, పన్నులు, బీమా ప్రీమియాలు, మెడికల్‌ బిల్లులు చెల్లించేయొచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపినప్పుడు రాయితీలు లభిస్తుంటాయి. కొన్నిసార్లు రివార్డు పాయింట్లు, నగదు వెనక్కిలాంటి వెసులుబాట్లూ ఉంటాయి. వీటిని పరిశీలిస్తూ ఉండాలి.

- బి.గోప్‌కుమార్‌,
ఎండీ, సీఈఓ, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని