సంక్షిప్త వార్తలు(6)

Eenadu icon
By Business News Desk Published : 29 Oct 2025 02:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

బొగ్గు వేలం విధివిధానాల్లోనే యూఎస్‌జీ నిబంధనలు 

దిల్లీ: బుధవారం ప్రారంభం కానున్న 14వ విడత బొగ్గు గనుల వేలం విధివిధానాల్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ (యూఎస్‌జీ)కు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెడుతోంది. 2030 కల్లా 100 మిలియన్‌ టన్నుల బొగ్గును గ్యాస్‌గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల సహజవాయువు, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. పెట్టుబడులకు కొత్త మార్గాలను సృష్టించడంతో పాటు సంబంధిత రంగాల్లో సాంకేతిక  పురోగతి, ఉద్యోగాల సృష్టికి వీలుంటుంది. 14వ విడత బొగ్గు గనుల వేలం కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సంప్రదాయ పద్ధతుల ద్వారా తవ్వేందుకు వీల్లేని బొగ్గు నిల్వలను, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రక్రియ కోసం ఉపయోగించుకుంటారు. పూర్తిగా అన్వేషించిన, పాక్షికంగా అన్వేషించిన బొగ్గు క్షేత్రాలను ఈ వేలంలో ఉంచుతారు. వేలంలో పాల్గొనేందుకు అనుభవమున్న గనుల సంస్థలు, కొత్త సంస్థలు, సాంకేతిక ఆధారిత సంస్థలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ వేలం కార్యక్రమంలోనే క్లాంప్, కోయ్లా శక్తి పోర్టల్‌లను కూడా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది.


రష్యా చమురు కొనుగోళ్లు కొనసాగించనున్న ఐఓసీ

దిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ), ఇతర భారత ఇంధన సంస్థలు పూర్తిగా నిలిపివేయకపోవచ్చని తెలుస్తోంది. రష్యా దిగ్గజ ఇంధన సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించినా.. ఆంక్షలు లేని సంస్థల నుంచి చమురు కొనుగోళ్లను మన సంస్థలు కొనసాగించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 4 రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించినట్లు సమాచారం. మనదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉన్న రాస్‌నెఫ్ట్‌.. వాస్తవానికి ఉత్పతిదారు కాదని, కేవలం అగ్రిగేటర్‌ మాత్రమేనని అంటున్నారు. మొత్తం దిగుమతుల్లో ఈ సంస్థ వాటా 45 శాతంగా ఉంది. రష్యాలోని క్షేత్రాల్లో, ఆంక్షలు పడని సంస్థలు చమురు తీసుకోవచ్చని, తద్వారా సరఫరాలు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. 

రష్యాకు చెందిన రెండు దిగ్గజ చమురు సంస్థలు రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌పై అమెరికా గతవారం ఆంక్షలు విధించడంతో భారత సంస్థలు ఎటువంటి కొత్త ఆర్డర్లను వాటికి పెట్టడం లేదు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఎటువంటి ఆంక్షలు లేవని, ఈ రెండు సంస్థల నుంచి మాత్రం కొనుగోళ్లు ఉండకపోవచ్చని సమాచారం. 


ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ గో

భారత్‌లో వినియోగదారులకు ఏడాది పాటు ఉచితంగా ‘చాట్‌జీపీటీ గో’ సేవలను అందించనున్నట్లు కృత్రిమ మేధ సంస్థ ఓపెన్‌ఏఐ ప్రకటించింది. నవంబరు 4 నుంచి పరిమిత కాలంలో నమోదు చేసుకున్న వినియోగదారులకు ఈ సేవలు లభిస్తాయి. ఈ ఏడాది ఆగస్టులో చాట్‌జీపీటీ గో సేవలు భారత్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఉచిత ప్లాన్‌తో పోలిస్తే చాట్‌జీపీటీ గోలో అదనంగా సందేశాల పరిమితులు, ఇమేజ్‌ జనరేషన్, ఫైల్‌   అప్‌లోడ్‌లను ఓపెన్‌ఏఐ అందిస్తోంది. నవంబరు 4న బెంగళూరులో మొదటిసారిగా జరగనున్న ఓపెన్‌ఏఐ డెవ్‌డే ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమం సందర్భంగా.. ఏడాది పాటు చాట్‌జీపీటీ గో సేవలను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం భారత్‌లోని చాట్‌జీపీటీ గో చందాదారులు కూడా ఏడాది పాటు ఉచిత సేవలను పొందొచ్చు. 


రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌తో సాంప్రె న్యూట్రిషన్స్‌ తయారీ ఒప్పందం 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాంప్రె న్యూట్రిషన్స్, రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌తో తయారీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌కు న్యూట్రాసూటికల్‌ ఉత్పత్తులు, కన్ఫెక్షనరీస్, లాలీపాప్స్, టాఫీస్, ఇతర తినుబండారాలను సాంప్రె న్యూట్రిషన్స్‌ మూడేళ్ల పాటు సరఫరా చేస్తుంది. ఈ మూడేళ్లలో ఏటా రూ.12-15 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉన్నట్లు సాంప్రె న్యూట్రిషన్స్‌ వెల్లడించింది.


వచ్చే ఏడాది మరో 20-24 విమానాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఆధీనంలోకి!

ముంబయి: వచ్చే ఏడాదిలో మరో 20-24 విమానాలు తమకు చేరనున్నట్లు ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) అలోక్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం సంస్థ వద్ద 110 విమానాలున్నాయి. ఇందులో ఎయిర్‌బస్‌ 320/321, బోయింగ్‌ 737, 737 మ్యాక్స్‌ మోడళ్లు ఉన్నాయని చెప్పారు. రెండేళ్ల క్రితం తమ విమానాల్లో 60% సమీప అంతర్జాతీయ కేంద్రాలకు వెళ్లేవని, దేశీయంగా 40% నడిచేవని తెలిపారు. అది కాస్తా ప్రస్తుతం 50-50 శాతంగా మారిందని వివరించారు. అంతర్జాతీయ వృద్ధికి మించి, దేశీయ ప్రయాణాల్లో వృద్ధి నమోదవ్వడం ఇందుకు కారణమన్నారు. దేశీయంగా దాదాపు 80% తమ విమానాలు మెట్రో నుంచి మెట్రో, 2-3 శ్రేణి నగరాలకు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.


విదేశాల్లో ఆస్తులు అమ్ముతాం: లుకోయిల్‌

ఫ్రాంక్‌ఫర్ట్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఆంక్షల నేపథ్యంలో, విదేశాల్లోని ఆస్తులు విక్రయిస్తామని రష్యా చమురు సంస్థ లుకోయిల్‌ తెలిపింది. ఉకెయ్రిన్‌పై యుద్ధాన్ని విరమించుకునేలా రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఆర్థికంగా కట్టడి చేసేందుకు రష్యా చమురు కంపెనీలపై ట్రంప్‌ ఆంక్షలు విధించారు. ఆస్తుల విక్రయం కోసం, ఇప్పటికే ఆసక్తిగల కొనుగోలుదార్లతో చర్చలు జరిపినట్లు లుకోయిల్‌ వెల్లడించింది. ఆంక్షల గడువుగా నిర్ణయించిన, నవంబరు 21లోగా ఈ విక్రయ లావాదేవీలను పూర్తి చేయాల్సి ఉంటుంది. లావాదేవీలను పూర్తి చేసేందుకు అవసరమైతే గడువు పొడిగింపు అడుగుతామని కంపెనీ తెలిపింది. 11 దేశాల్లో చమురు- గ్యాస్‌ ప్రాజెక్టుల్లో లుకోయిల్‌కు వాటాలున్నాయి. బల్గేరియా, రొమేనియాలో చమురు శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. నెదర్లాండ్స్‌లోని ఒక రిఫైనరీలో 45% వాటాతో పాటు పలు దేశాల్లో గ్యాస్‌ స్టేషన్లూ ఈ సంస్థకు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని