అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌!

Eenadu icon
By Business News Desk Published : 30 Oct 2025 02:46 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కొన్నేళ్లలో సాధ్యం: ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా 

ముంబయి: రాబోయే దశాబ్దాల్లో సంస్కరణలు, ఆర్థిక మూలాల కారణంగా వర్థమాన దేశం నుంచి అభివృద్ధి దేశంగా మారే దిశలో భారత్‌ పయనిస్తోందని.. ఇంకా చెప్పాలంటే కొన్నేళ్లలోనే అది సాధ్యం కావొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌ పూనమ్‌ గుప్తా పేర్కొన్నారు. బుధవారమిక్కడ జరిగిన ‘బిజినెస్‌ స్టాండర్డ్‌ బీఎఫ్‌ఎస్‌ఐ ఇన్‌సైట్‌ సమిట్‌’లో పూనమ్‌ మాట్లాడుతూ ‘దేశంలో విధాన సంస్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. అవి అంతర్జాతీయంగా అత్యుత్తమంగా ఉన్నాయి. 1991 వరకు నియంత్రణలో ఉన్న మారకపు రేటు, ఇపుడు మార్కెట్‌ ఆధారంగానే కదలాడుతోంది. అయితే విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణలో భేషుగ్గా ఉన్నాం. ఇవన్నీ మన అంతర్గత బలాలు. వస్తువుల పరంగా ఏర్పడుతున్న వాణిజ్య లోటును, బలమైన సేవల ఎగుమతులతో పూడ్చుకోగలుగుతున్నాం. చమురు ధర కూడా ఇపుడు సానుకూలంగా మారింది. మొత్తం మీద కరెంట్‌ ఖాతా లోటు స్థిరత్వం దిశగా వెళుతోంద’ని అన్నారు. ‘కరోనా వంటి అనిశ్చితులు తలెత్తినా.. దేశ ద్రవ్య స్థిరీకరణ మార్గం గతి తప్పలేదు. 2016లో ప్రవేశపెట్టిన ద్రవ్యోల్బణ ఆధారిత పరపతి విధానం.. ప్రధాన నిర్మాణాత్మక సంస్కరణగా చెప్పొచ్చు. దాని వల్లే ద్రవ్యోల్బణం దిగువకు రావడమే కాక, హెచ్చుతగ్గులూ తక్కువగానే నమోదవుతున్నాయి’ అన్నారు. 

‘విధాన సంస్కరణల కారణంగా భారత జీడీపీ, తలసరి ఆదాయ వృద్ధి క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రపంచంలోనే అధిక వృద్ధిరేటు నమోదు చేస్తున్నాం. సమీప భవిష్యత్తులోనూ వృద్ధి అంచనాలు ఆశావహంగా ఉన్నాయి. అందుకే రాబోయే సంవత్సరాల్లో వర్థమాన దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారే అవకాశం కనిపిస్తోంద’ని అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు