cancer drugs: అందరి చూపు క్యాన్సర్‌ మందులపైనే

మన దేశంలో క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి 9 లక్షలకు చేరింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది.

Updated : 26 May 2024 11:20 IST

భాగస్వామ్యాలతో ముందుకెళ్తున్న దేశీయ సంస్థలు
బయోసిమిలర్, జనరిక్‌ మందుల ఆవిష్కరణకు కృషి
ఏడాదికి మరణాలు 9 లక్షలకు చేరిన నేపథ్యం
ఈనాడు - హైదరాబాద్‌

మన దేశంలో క్యాన్సర్‌తో మరణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి 9 లక్షలకు చేరింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. గతంలో ఇంత అధికంగా కేసులు నమోదు కాలేదు. బాధితులు వైద్యులను సంప్రదించడం, మందుల వినియోగమూ అంతగా ఉండేది కాదు. కానీ ఇటీవల కాలంలో క్యాన్సర్‌ అని నిర్ధారించిన వెంటనే ఆస్పత్రుల్లో చేరి చికిత్స చేయించుకోవడం, మందులు వాడటం పెరుగుతోంది. ఈ పరిణామాలతో క్యాన్సర్‌ ఔషధాల మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తోంది.

ధరలు దిగిరావొచ్చు..

క్యాన్సర్‌ మందులు అందించే ఫార్మా కంపెనీలు అధిక ఆదాయాలు నమోదు చేసే అవకాశాలు పెరిగాయి. అందువల్ల గత కొంతకాలంగా దేశీయ ఫార్మా కంపెనీలు క్యాన్సర్‌ మందులపై దృష్టి సారిస్తున్నాయి. దీని కోసం పలు కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. ఇందులో పరిశోధన- అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) భాగస్వామ్యాలతో పాటు మార్కెటింగ్‌ ఒప్పందాలు ఉంటున్నాయి. తద్వారా దేశీయ ఫార్మా కంపెనీలకు క్యాన్సర్‌ మందుల అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీ విభాగాల్లో అనుభవం గడించే అవకాశం కలుగుతోంది. పలు కొత్త మందులను మన దేశంతో పాటు ఇతర దేశాల్లోనూ విస్తృతంగా అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాయి. దీనివల్ల సమీప భవిష్యత్తులో క్యాన్సర్‌ మందుల లభ్యత మరింత అధికమై, మందుల ఖర్చు దిగివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏ కంపెనీ.. ఏ భాగస్వామితో..

క్యాన్సర్‌ మందులైన టిస్లిజుమ్యాబ్, జానుబ్రుటినిబ్‌లను మనదేశంలో పంపిణీ చేసే నిమిత్తం గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్, చైనాకు చెందిన బిజీన్‌ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా బాధితులకు ఈ మందులు అందుబాటులోకి వస్తాయని గ్లెన్‌మార్క్‌ ఫార్మాసూటికల్స్‌ అధ్యక్షుడు అలోక్‌ మాలిక్‌ పేర్కొన్నారు. ఈ మందులకు మన దేశంలో అనుమతులు తీసుకోవడం, అందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించడం, పంపిణీ.. తదితర అంశాలను గ్లెన్‌మార్క్‌ ఫార్మా చేపడుతుంది. మల్టిపుల్‌ మైలోమా(బోన్‌ మెటాస్టాసెస్‌) అనే క్యాన్సర్‌ వ్యాధికి చికిత్సలో వినియోగించే డెనోసుమ్యాబ్‌ అనే బయోసిమిలర్‌ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, అమెరికాకు చెందిన అల్వోటెక్‌ అనే బయోటెక్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మందును ప్రొలియా, గ్జెవా అనే బ్రాండ్‌ పేర్లతో ఆమ్‌జెన్‌ ఇంక్‌. ఔషధ సంస్థ విక్రయిస్తోంది. ఈ బయోసిమిలర్‌ ఔషధాన్ని అల్వోటెక్‌ ఇంక్‌ అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేస్తుంది. తదుపరి అమెరికా, యూకే, కొన్ని ఐరోపా దేశాల్లో ఈ మందును విక్రయించే అవకాశం డాక్టర్‌ రెడ్డీస్‌కు లభిస్తోంది. ఇటీవల డాక్టర్‌ రెడ్డీస్‌ బెవాసిజుమ్యాబ్‌ అనే బయోసిమిలర్‌ క్యాన్సర్‌ ఔషధాన్ని యూకేలో విడుదల చేసింది. 

ఇతర ఒప్పందాలు..

  • కాబోజెంటినిబ్‌ అనే క్యాన్సర్‌ మందును అమెరికాలో పంపిణీ చేయడం కోసం హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్, ఇటీవల జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 
  • కొంతకాలం క్రితం గ్లెన్‌మార్క్‌ ఫార్మా, ఎన్వాఫోలిమ్యాబ్‌ అనే క్యాన్సర్‌ మందు అభివృద్ధి, మార్కెటింగ్, పంపిణీ నిమిత్తం సూటికల్స్‌ జియాంగ్సు ఆల్ఫామ్యాబ్‌ బయోఫార్మాసూటికల్స్, 3డి మెడిసిన్స్‌ అనే కంపెనీలతో లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 
  • సీఎంఎల్‌ అనే క్యాన్సర్‌ వ్యాధి చికిత్సలో వినియోగించే నిలోటినిబ్‌ అనే మందును ఉత్పత్తి చేసి అందించటానికి యూగియా ఫార్మా, హెటెరో, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ గత ఏడాదిలో మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ) అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 
  • నాట్కో ఫార్మా, అరబిందో ఫార్మా, సెలాన్‌ ల్యాబ్స్, విర్కో బయోటెక్‌.. తదితర సంస్థలు కొంత కాలంగా క్యాన్సర్‌ ఔషధాల విభాగంలో వేగంగా విస్తరిస్తున్నాయి. నాట్కో ఫార్మా దేశీయ మార్కెట్లోనే కాకుండా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా దేశాలకు క్యాన్సర్‌ మందులు అందిస్తోంది. అరబిందో ఫార్మా క్యాన్సర్‌ విభాగానికి చెందిన బయోసిమిలర్‌ ఔషధాలను అమెరికా, ఐరోపా దేశాల్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. 

అమ్మకాల్లో 15% వృద్ధి

మనదేశంలో 2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.16,500 కోట్లు) క్యాన్సర్‌ మందుల అమ్మకాలు నమోదవుతున్నాయి. కొన్నేళ్ల పాటు వీటి అమ్మకాల్లో ఏటా 15% వృద్ధి ఉంటుందని అంచనా. దీని ప్రకారం 2028 నాటికి దేశీయ క్యాన్సర్‌ ఔషధాల మార్కెట్‌ 3.5 బిలియన్‌ డాలర్ల (రూ.29,000 కోట్లకు పైగా)కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. విదేశాలకు ఈ మందులను ఎగుమతి చేసే అవకాశమూ దేశీయ ఫార్మా కంపెనీలకు ఉంది. అందుకే ఈ మార్కెట్‌పై ఫార్మా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని