ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగాయ్‌

ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్‌ అండ్‌ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్‌లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్‌ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి.

Updated : 19 May 2024 02:42 IST

ఏప్రిల్‌లో రూ.2225 కోట్లకు
ఏడాది క్రితం రూ.267 కోట్ల మేరకే

ముంబయి: ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోకి పసిడి ఆభరణాల దిగుమతులు భారీగా పెరిగి రూ.2225 కోట్ల (268.04 మిలియన్‌ డాలర్ల) స్థాయికి చేరాయని జెమ్‌ అండ్‌ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 2023 ఏప్రిల్‌లో ఇవి సుమారుగా రూ.267 కోట్ల (32.12 మిలియన్‌ డాలర్ల) స్థాయిలోనే ఉన్నాయి. అంటే ఏడాది వ్యవధిలో ఆభరణాల దిగుమతులు 734% పెరిగాయి. బంగారం ధర ఎక్కువగా ఉన్నా, వివాహాది శుభకార్యాలు - అక్షయతృతీయ పండగ దిగుమతులు పెరిగేందుకు కారణమయ్యాయని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలోకి దిగుమతి అయిన మొత్తం పసిడి విలువ సుమారు రూ.26,000 కోట్లు (3114.6 మిలియన్‌ డాలర్లు)గా ఉంది. గతేడాది ఇదే నెలలో దిగుమతి అయిన మొత్తం పసిడి విలువ కంటే ఇది 209% ఎక్కువ. ఇదే సమయంలో మన దేశం నుంచి ఎగుమతి అయిన బంగారు ఆభరణాల విలువ 11% అధికమై సుమారు రూ.6,000 కోట్ల (718.34 మిలియన్‌ డాలర్ల)కు చేరింది.

పశ్చిమాసియా దేశాలకు మన ఎగుమతులు: మన దేశం నుంచి ఆభరణాల ఎగుమతులు పశ్చిమాసియా దేశాలకు అధికంగా జరుగుతున్నాయి. ఇక్కడ తయారీ ఛార్జీలు తక్కువగా ఉండటం, ఆకర్షణీయ డిజైన్లను రూపొందించడం ఇందుకు కారణమని కేడియా అడ్వైజరీ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఆభరణాల ఎగుతులు 10-15% పెరిగే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. దేశీయంగా కూడా రుతు పవనాలు బాగుంటాయనే అంచనాల నేపథ్యంలో, సమీప భవిష్యత్తులో ఇక్కడా పసిడికి గిరాకీ అధికమవుతుందని, ఈ కొనుగోళ్లపై ప్రతిఫలం బాగుండటమూ కలిసొస్తోందని వివరించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని