Goldman Sachs : గోల్డ్‌మన్‌ శాక్స్‌ వృద్ధిలో క్షీణత.. సీఈఓ వేతనంలో భారీ కోత

ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ (Goldman Sachs).. కంపెనీ సీఈఓ డేవిడ్ ఎం సాలమన్ ( David M Solomon) వేతనంలో భారీ స్థాయిలో కోత విధించింది.

Updated : 28 Jan 2023 18:51 IST

దిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ (Goldman Sachs).. కంపెనీ సీఈఓ డేవిడ్ ఎం సాలమన్ ( David M Solomon) వేతనంలో భారీ స్థాయిలో కోత విధించింది. 2021-22 వార్షిక వేతనంలో దాదాపు 30 శాతం తగ్గించింది. 

అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి(2020-2021) గానూ ఆయన వేతనం 35 మిలియన్ల డాలర్లు ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం 25 మిలియన్‌ డాలర్లు అందుకున్నట్లు బ్యాంక్‌ తన ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో అత్యధిక వేతనం పొందే బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ జాబితాలో   తన అగ్రస్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఈ జాబితాలో జేపీ మోర్గాన్ ఛేజ్‌ సీఈఓ జామీ డిమోన్‌ తొలి స్థానంలో ఉన్నారు. 2022 ఆర్థిక సంవత్సరంలో జామీ 35 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు.

బ్యాంకింగ్‌ సేవల్లో చేసిన పొరపాట్లతో బిలియన్ల నష్టాలు వచ్చాయని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంగీకరించింది. ఆ కారణం వల్లే రుణగ్రహీతల కోసం ఖాతాల తనిఖీ, ఇతర ఉత్పతులను ప్రారంభించటం వంటి పెద్ద ప్రణాళికలను వెనక్కు తీసుకున్నట్టు కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొన్నట్లు అమెరికా పత్రికలు వెల్లడించాయి. సాలమన్‌ వ్యవహార శైలి కారణంగా కంపెనీ నుంచి అనేక మంది సీనియర్లు నిష్క్రమించారని తెలిపాయి.

గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈ నెలలో 3,200 మంది ఉద్యోగులను తొలగించింది ( layoffs). కంపెనీలో తీసుకున్న పలు అనాలోచిత నిర్ణయాల కారణంగా ఉద్యోగుల కోతలు తప్పలేదని తెలుస్తోంది. సాలమన్‌ వేతనంలో కోత.. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ పనితీరును ప్రతిబింబిస్తోందని కంపెనీ తన ఫైలింగ్‌లో అసంతృప్తిని వ్యక్తం చేసింది.

సాలమన్‌ 2018 నుంచి కంపెనీ సీఈఓగా ఉన్నారు. 2020లో ఆయన మలేషియా సార్వభౌమ సంపద నిధి లూటీకి ప్రోత్సహించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని ధ్రువీకరించిన కంపెనీ ఆ ఏడాది ఆయన వేతనాన్ని నిలిపివేసినట్లు అమెరికా పత్రికల కథనాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని