Ashwini Vaishnaw: భారతీయ యాప్‌ల పునరుద్ధరణకు గూగుల్‌ ఓకే: అశ్వినీ వైష్ణవ్‌

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన భారతీయ యాప్‌లను రీలిస్ట్ చేసేందుకు అంగీకరించినట్లు కేంద్ర టెలికాం, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Published : 05 Mar 2024 18:28 IST

దిల్లీ: గూగుల్ ప్లేస్టోర్‌ (Google PlayStore) నుంచి తొలగించిన భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను రీస్టోర్‌ చేసేందుకు గూగుల్‌ అంగీకరించింది. ఈమేరకు కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) సమక్షంలో గూగుల్‌ సంస్థ, స్టార్టప్‌ కంపెనీల మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీలో ఫీజు చెల్లింపులపై ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దేశ సాంకేతిక రంగ అభివృద్ధికి గూగుల్‌ తోడ్పాటునిస్తుందని మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు వైష్ణవ్‌ తెలిపారు. 

గూగుల్‌ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయడం లేదని వివిధ డెవలపర్స్‌కు సంబంధించిన యాప్‌లను శుక్రవారం ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. ఈ చర్యను కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టింది. స్టార్టప్‌ సంస్థలకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తామని అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. దీంతో కొన్ని యాప్‌లను గూగుల్‌ పునరుద్ధరించింది. సోమవారం ఇరువర్గాలతో  ఐటీ మంత్రిత్వశాఖ చర్చలు జరిపింది. తాజాగా మరోమారు మంగళవారం జరిగిన చర్చల్లో అన్ని యాప్‌లను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అంగీకరించింది. గూగుల్, మెటా వంటి సంస్థలకు భారత్‌ అతిపెద్ద ఇంటర్నెట్‌ మార్కెట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. 

చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్‌.. ఇకపై సమాధానాలు వినొచ్చు

యాప్‌ డెవలపర్స్‌ నుంచి 15-30 శాతం ఛార్జీలు వసూలుచేయకూడదని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) గతంలో గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం 11-26% ఫీజును వసూలుచేస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గూగుల్‌ ప్లేస్టోర్‌ను మ్యాట్రిమొనీ.కామ్‌, షాదీ.కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అనాకడమీ, ఆహా, డిస్నీ+ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ వంటి కంపెనీలు సవాలు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో తమ ప్లాట్‌ఫాం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ 10 కంపెనీలు ఫీజులను చెల్లించట్లేదని గూగుల్‌ పేర్కొంది. ఈ అంశంలో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించిందని తెలిపింది. ఈక్రమంలోనే షాదీ, మ్యాట్రిమొనీ, బాలాజీ టెలీఫిల్మ్స్‌కు చెందిన ఆల్ట్‌, ఆడియో ప్లాట్‌ఫాం కుకు ఎఫ్‌ఎమ్‌, డేటింగ్‌ యాప్‌ క్వాక్‌క్వాక్‌, ట్రూలీ మ్యాడ్లీ, నౌకరీ, 99 ఏకర్స్‌, శిక్షా మొబైల్ తదితర యాప్‌లు డీలిస్ట్‌కు గురయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని