Layoffs: గూగుల్‌, అమెజాన్‌లో మరోసారి తొలగింపులు

గూగుల్‌, అమెజాన్‌ సంస్థలు మరికొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే, తాజా నిర్ణయంతో ఎంతమందిపై ప్రభావం ఉంటుందనే విషయం వెల్లడికాలేదు.

Published : 11 Jan 2024 19:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ (Google) మాతృ సంస్థ అల్ఫాబెట్‌ (Alphabet) మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. గూగుల్‌ అసిస్టెంట్, హర్డ్‌వేర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థికపరంగా సంస్థపై భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘‘గతేడాది ద్వితీయార్థంలో వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా మా బృందాలు ఎంతో సమర్థవంతంగా పనిచేశాయి. ఇకపై కూడా అది కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సంస్థపై నిర్వహణపరమైన భారాన్ని తగ్గించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నాం’’అని గూగుల్‌ అధికార ప్రతినిధి తెలిపారు. 

కంపెనీ తాజా నిర్ణయంపై అల్ఫాబెట్ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘అద్భుతమైన ఉత్పత్తులను అందించేందుకు మా సహచరులు రోజూ కష్టపడి పనిచేస్తుంటారు. ప్రతి త్రైమాసికంలో బిలియన్ల లాభాలను అర్జిస్తున్న సంస్థ.. సిబ్బందిని తొలగించడం బాధాకరం. ఉద్యోగ భద్రత కోసం మా పోరాటం కొనసాగుతుంది’’ అని వెల్లడించింది. 

గూగుల్‌ బాటలోనే అమెజాన్‌

అమెజాన్‌ కూడా ప్రైమ్‌ వీడియో, ఎంజీఎం స్టూడియో విభాగాల్లో కొంత మంది సిబ్బందికి ఉద్వాసన పలికింది. బుధవారం రెండు విభాగాల పనితీరుపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. తొలగించిన వారి జాబితాలో ఉన్న ఉద్యోగులకు త్వరలోనే సమాచారం తెలియజేస్తామని ప్రైమ్‌ వీడియో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ మైక్‌ హాప్కిన్స్‌ తెలిపారు. అయితే, తాజా నిర్ణయంతో ఎంత మందిపై ప్రభావం ఉంటుందనే విషయం వెల్లడికాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని