Google: గుర్తింపు కోసం గూగుల్‌ ఉద్యోగిని చెప్పిన ఐదు సూత్రాలివే..!

Google: ఒక వ్యక్తి పనిచేసే సంస్థను బట్టే అతడిని చాలా మంది గుర్తిస్తారు. సంస్థను బట్టి కాకుండా వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి కొన్ని సూత్రాలు సూచిస్తున్నారు గూగుల్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగి. ఆ సూత్రాలివే..

Published : 16 Nov 2023 02:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒక్కసారైనా పనిచేయాని కోరుకొనే దిగ్గజ సంస్థ గూగుల్‌. ఈ కంపెనీ అందించే జీతభత్యాలు, వసతులు, ప్రయోజనాలే అందుకు కారణం. అంతేకాదు గూగుల్‌లో పనిచేయడం గొప్ప స్టేటస్‌గా భావించేవాళ్లూ అనేకమంది ఉంటారు. చాలా మంది ఇలాంటి పేరుమోసిన కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసేందుకే ఇష్టపడతారు. అయితే, పనిచేస్తున్న సంస్థ ద్వారా కాకుండా.. వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే మాత్రం ఐదు సూత్రాలు పాటించాలంటున్నారు గూగుల్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి. కెనడాకు చెందిన ఆమె కెరియర్‌కు కొన్ని సూత్రాలను షేర్‌ చేసుకున్నారు. అవేంటంటే..

  • వ్యక్తిగా గుర్తింపు పొందాలంటే.. చర్చించే నైపుణ్యం అవసరం. ఒకవేళ మీలో ఆ నైపుణ్యం లేకపోతే నేర్చుకొనేందుకు ప్రయత్నించండి. ఏదైనా చిన్న వస్తువు విషయంలో బేరమాడటం మొదలు కొని.. సర్వీస్‌ ప్రొవైడర్‌తో ఒప్పందంలోని అంశాలపై చర్చించడం వంటివి అలవాటు చేసుకోండి. మీకు కొంత విశ్వాసం వచ్చాక జీతం పెంపు వంటి పెద్ద విషయాల్లో ఇదే నైపుణ్యం ఉపయోగపడుతుంది.
  • కెరీర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లు లేదా డబ్బున్న వాళ్లకు మాత్రమే కోచింగ్‌ అవసరమని  చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఎవరైతే తమ కెరీర్‌ను మెరుగుపరచుకోవాలనుకుంటారో వాళ్లకు కోచింగ్‌ అనేది ఓ విలువైన పెట్టుబడి. లక్ష్యాన్ని గుర్తించడంలో, వాటిని సాధించేందుకు ప్రణాళికల్ని రూపొందించటంలో మీకు ఎదురయ్యే సవాళ్లు అధిగమించడంలో ఒక మంచి కోచ్‌ మీకు సాయపడతాడు.
  • మూడో అంశం మీ పట్ల మీరు దయ కలిగి ఉండడం. తప్పులు జరిగినా, పర్‌ఫెక్ట్‌గా లేకపోయినా ఫర్వాలేదు. గమ్యాన్ని చేరుకొనే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ పట్ల మీరు దయ స్వభావంతో ఉండాలి. అలాగే సాధించింది చిన్న విజయమే అయినా దాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. లక్ష్యాన్ని సాధించినందుకు మీరు చేసిన కృషికి అభినందించడానికి సమయం వెచ్చించండి.
  • వేరే వ్యక్తులతో పోల్చుకోవడం మానేయండి. ఎవరి ప్రయాణం వారిది. అందరికీ ఒకే మార్గం నప్పదు.
  • వృత్తి జీవితం కాకుండా ఇతర అంశాలపై అభిరుచి, నైపుణ్యం కలిగి ఉండడం ముఖ్యం. ఇది కెరీర్‌ సక్సెస్‌ కావడానికి, జీవితాన్ని సమతుల్యం చేయడానికి సాయపడుతుంది. అంతేకాదు మిమ్మల్ని అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా నిలుపుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని