Google layoffs: గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!

Google layoffs: గూగుల్‌ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు జపాన్‌ కంపెనీ తోషిబా సైతం ఉద్యోగుల ఉద్వాసనకు సిద్ధమైంది. 

Updated : 18 Apr 2024 11:13 IST

Google layoffs | వాషింగ్టన్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు (Google layoffs) సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రాసిన అంతర్గత లేఖలో వెల్లడించారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

సీఎఫ్‌వో ఏం చెప్పారంటే..

‘‘కృత్రిమ మేధ వల్ల టెక్‌ రంగంలో మార్పులు వస్తున్నాయి. మన కోట్లాది మంది కస్టమర్లకు మెరుగైన ఉత్పత్తులను అందించడానికి ఇది ఒక సదావకాశం. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలూ తీసుకోవాల్సి వస్తోంది. మన ప్రాధాన్యాలు ఏంటో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫలితంగా నైపుణ్యం కలిగిన కొంతమంది సభ్యులను బయటకు పంపాల్సి వస్తోంది. ఇది చాలా కష్టమైన విషయమని మాకు తెలుసు’’ అని ఉద్యోగులకు రాసిన లేఖలో సీఎఫ్‌వో తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని సీఈవో సుందర్‌ పిచాయ్‌ గతంలోనే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఎంత మందిపై వేటు..

పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కొంత మంది ఉద్యోగులను ఇతర విధుల్లోకీ గూగుల్‌ బదిలీ చేస్తోంది. భారత్‌లో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఆ సంస్థ.. కొంతమందిని ఇక్కడకూ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మొత్తంగా ఎంత మందిని తొలగిస్తున్నారు? ఎంత మందిని బదిలీ చేస్తున్నారనే విషయాన్ని కంపెనీ బహిర్గతం చేయలేదు.

2024లో టెక్‌ లేఆఫ్స్‌..

ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. టెస్లా, యాపిల్‌, అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు సైతం తమ సిబ్బందిని తగ్గించుకున్నాయి. 2024లో ఇప్పటి వరకు దాదాపు 58 వేల మంది ఉద్వాసనకు గురైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.


తోషిబాలో 5,000 మందిపై వేటు

జపాన్‌కు చెందిన బడా కంపెనీ తోషిబా (Toshiba) సైతం ఉద్యోగ కోతలకు సిద్ధమైంది. నిక్కీ నివేదిక ప్రకారం.. దాదాపు 5,000 మందిని తొలగించనుంది. కంపెనీ సిబ్బందిలో ఇది 10 శాతానికి సమానం. ఇన్‌ఫ్రా, డిజిటల్‌ టెక్‌ వంటి కీలక రంగాలపై దృష్టి సారించడంలో భాగంగానే పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేస్తోంది.

జపాన్‌లో (Japan) అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీల్లో తోషిబా ఒకటి. ఇటీవల ఈ సంస్థను ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. నిర్వహణ లోపాలు, అవినీతి ఆరోపణలూ వచ్చాయి. అకౌంటింగ్‌లో అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున జరిమానా కూడా చెల్లించింది. మెమొరీ చిప్‌ వ్యాపారాన్ని విక్రయించింది.

జపాన్‌లో ఉద్యోగులను తీసివేయడం చాలా అరుదు. అక్కడి చట్టాలే అందుకు కారణం. కానీ, ఈ మధ్య కొన్ని కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. ఇది అక్కడి కార్పొరేట్‌ సంస్కృతిలో వచ్చిన మార్పులను సూచిస్తోంది. అయితే, దేశంలో ఉద్యోగుల కొరత ఉండడంతో పెద్దగా నిరసనలు వెల్లువెత్తడం లేదు. ఉద్వాసనకు గురైన వారు ఇతర కంపెనీల్లో సులువుగానే చేరిపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని