Google: డీఫాల్ట్‌ సెర్చింజన్‌ కోసం గూగుల్‌ 26 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది: గూగుల్‌ ఉద్యోగి

యూఎస్‌-గూగుల్‌ మధ్య యాంటీట్రస్ట్‌ కేసు కోర్టులో కొనసాగుతోంది. విచారణలో భాగంగా శుక్రవారం కీలక విషయాలు వెల్లడయ్యాయి. గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చింజన్‌గా ఉంచేందుకు పలు కంపెనీలకు ఆ సంస్థ  26.3 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసింది. 

Published : 28 Oct 2023 05:32 IST

వాషింగ్టన్‌: సెర్చింజన్‌ మార్కెట్లో గూగుల్‌ ఆధిపత్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కూడా గూగుల్‌ తీరుపై మండిపడ్డారు. ఇదే విషయంపై యూఎస్‌ ప్రభుత్వం, గూగుల్‌ మధ్య యాంటీట్రస్ట్‌ కేసు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మొబైల్స్‌, వెబ్‌బ్రౌజర్లలో గూగుల్‌ను డీఫాల్ట్‌ సెర్చింజన్‌గా ఉంచేందుకు 2021లో ఆ సంస్థ పలు కంపెనీలకు 26.30 బిలియన్‌ డాలర్లు చెల్లించిందట. గూగుల్‌ సెర్చ్‌ అండ్‌ అడ్వర్టైజ్‌మెంట్‌ విభాగంలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తోన్న ప్రభాకర్‌ రాఘవన్‌ ఈ వివరాలు వెల్లడించారు. 

డీఫాల్ట్‌ సెర్చింజన్‌ స్టేటస్‌ కోసం గూగుల్‌ చెల్లింపులు 2014 నుంచి ముడింతలు పెరిగాయని ప్రభాకర్‌ పేర్కొన్నారు. సెర్చ్‌ యాడ్స్‌ ద్వారా గూగుల్‌కి 2021లో 146.4బిలియన్‌ డాలర్లు రెవెన్యూ వచ్చిందని.. అందులో ఎక్కువ మొత్తం డీఫాల్ట్‌ సెట్టింగ్‌ కోసమే ఖర్చవుతోందని చెప్పారు. అయితే, ఈ ఖర్చు అంతా న్యాయంగానే ఖర్చు చేస్తున్నామని గూగుల్‌ చెబుతోంది. ఈ పెట్టుబడులంతా సెర్చ్‌ అండ్‌ అడ్వర్టైజింగ్‌ బిజినెస్‌లో పోటీతత్వం కోసమేనని సమర్థించుకుంది. ఒకవేళ డీఫాల్ట్‌ సెర్చింజన్‌ యూజర్లకు నచ్చకపోతే మార్చుకునే సదుపాయం ఉందని గుర్తు చేసింది. ఇలా చెల్లింపులకు సంబంధించిన వివరాలు బహిర్గతం చేయడం వల్ల భవిష్యత్తులో తము కుదుర్చుకునే కాంట్రాక్టులపై ప్రభావం చూపుతుందని గూగుల్‌ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కోర్టు మాత్రం వివరాలు వెల్లడించాల్సిందేనని స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని