Google: సీసీఐ జరిమానా ఉత్తర్వులపై కోర్టుకు గూగుల్‌..?

అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) విధించిన జరిమానాపై న్యాయస్థానంలో సవాల్‌ చేయాలని గూగుల్‌ భావిస్తోంది.

Updated : 29 Oct 2022 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అనైతిక వ్యాపార పద్ధతులు అవలంబిస్తోందంటూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) విధించిన జరిమానాపై న్యాయస్థానంలో సవాల్‌ చేయాలని గూగుల్‌ భావిస్తోంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వ్యవస్థ వ్యవహారంలో కోర్టును ఆశ్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీసీఐ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇతర అంశాల్లోనూ ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గూగుల్‌ ఆందోళన చెందుతోందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వారంలోపే సీసీఐ ఉత్తర్వులను సవాల్‌ చేయాలని నిర్ణయించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే, న్యాయపరంగా ఎదుర్కొనే విషయంపై స్పందించేందుకు గూగుల్‌ నిరాకరించింది.

ఆండ్రాయిడ్‌ మొబైళ్ల విభాగంలో గూగుల్‌ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందంటూ ఈ నెల 20న సీసీఐ సుమారు రూ.1337.76 కోట్ల జరిమానా వేసింది. వారం కూడా తిరగకముందే, గూగుల్‌ ప్లే స్టోర్‌ విధానాల్లో పోటీతత్వానికి వ్యతిరేకమైన వాటిని అనుసరిస్తోందంటూ మరో రూ.936.44 కోట్ల అపరాధ రుసుము వడ్డించింది. తక్షణం తీరు మార్చుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అయితే గూగుల్‌కు ఈ స్థాయిలో భారత్‌లో ఎదురుదెబ్బ తగలడం ఇదే తొలిసారి. గతంలో గూగుల్‌కు యూరప్‌ ప్రభుత్వం దాదాపు రూ. 3 వేల కోట్ల మేర జరిమానా విధించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌లు తయారు చేసే కంపెనీలకు గూగుల్‌ పరిమితులు విధిస్తోందన్న కారణంతో అక్కడి ప్రభుత్వం భారీ జరిమానా వేసింది. దీనిపై కోర్టుకెళ్లినప్పటికీ గూగుల్‌కు నిరాశే ఎదురైంది. 2018 నాటి తీర్పును ఇటీవలే  యూరోపియన్‌ కోర్టు సమర్థించింది. కొద్ది రోజులకే భారత్‌లో సైతం అలాంటి అనుభవమే గూగుల్‌కు ఎదురవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని