Google Pixel: భారత్‌లో గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్ల తయారీ.. 2024లో అందుబాటులోకి

Google Pixel: మేకిన్‌ ఇండియాలో భాగంగా పిక్సెల్‌ సిరీస్‌ ఫోన్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది.

Updated : 19 Oct 2023 17:43 IST

దిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్‌ (Google) కీలక ప్రకటన చేసింది. తమ ప్రీమియం ఫోన్‌ అయిన పిక్సెల్‌ సిరీస్‌ (Pixel smartphones)ను భారత్‌లో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. మేకిన్‌ ఇండియాలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రిక్ ఓస్టెర్లో తెలిపారు. ‘గూగుల్‌ ఫర్‌ ఇండియా’ కార్యక్రమంలో గురువారం ఆయన ఈ ప్రకటన చేశారు. టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమక్షంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత్‌లో తయారైన పిక్సెల్‌ ఫోన్లు (Pixel smartphones) 2024 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తాయని రిక్ ఓస్టెర్లో చెప్పారు. భారత్‌లో ఫోన్ల ఉత్పత్తి కోసం అంతర్జాతీయ కాంట్రాక్టు తయారీ సంస్థలతో గూగుల్‌ (Google) ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. గూగుల్‌ 2016 నుంచి ఆండ్రాయిడ్‌ ఆధారిత పిక్సెల్‌ ఫోన్లను (Pixel smartphones) తయారు చేస్తోంది. కానీ, భారత్‌లో మాత్రం పిక్సెల్‌ 7 నుంచే వీటిని విడుదల చేయడం ప్రారంభించింది. అంతకు ముందు వచ్చిన పిక్సెల్‌ 4, పిక్సెల్‌ 5, పిక్సెల్‌ 6 సిరీస్‌ ఫోన్లు నేరుగా భారత విపణిలోకి రాలేదు. ఇటీవలే పిక్సెల్‌ 8 సిరీస్‌ ఫోన్లు రూ.75,999 ప్రారంభ ధరతో విడుదలైన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మే నెలలో అశ్వినీ వైష్ణవ్‌ కాలిఫోర్నియాలో గూగుల్‌ (Google) సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో చర్చలు జరిపారు. భారత్‌లో తయారీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలను ఆయనకు వివరించారు. ఈ పరిణామాల అనంతరం గూగుల్‌ (Google) నుంచి తాజా ప్రకటన వెలువడడం గమనార్హం.

ఇప్పటికే యాపిల్‌ తమ ఐఫోన్లను భారత్‌లో తయారు చేస్తున్న విషయం తెలిసిందే. 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఏడు బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఫోన్లను తయారు చేసింది. ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్‌, విస్ట్రోన్‌ వంటి కంపెనీలు యాపిల్‌ కోసం ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ తమ గెలాక్సీ ఫోన్లను సైతం భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. చైనాకు చెందిన షావోమి కూడా భారత్‌లో తయారీ చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా గూగుల్‌ (Google) సైతం అదే బాటలో పయనించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని