Byjus: బైజూస్‌ విషయం త్వరగా తేల్చండి.. అధికారులకు కేంద్రం ఆదేశం

Byjus: బైజూస్‌కు మరో కొత్త చిక్కు ఎదురైంది. ఆ కంపెనీ ఖాతా పుస్తకాల తనిఖీకి ఆదేశించిన కేంద్రం.. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది.

Published : 26 Feb 2024 15:12 IST

Byjus | దిల్లీ: ఓ వైపు ఆర్థిక కష్టాలు.. మరోవైపు వాటాదారుల ఒత్తిడితో సతమతమవుతున్న బైజూస్‌ (BYJUS) విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కంపెనీ ఖాతా పుస్తకాల తనిఖీకి ఆదేశించిన కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ.. ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని పేర్కొన్నట్లు ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

బైజూస్‌ పేరిట ఎడ్‌టెక్‌ సంస్థను నడుపుతున్న థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఖాతా పుస్తకాలను తనిఖీ చేయాలని హైదరాబాద్‌ ప్రాంతీయ డైరెక్టర్‌కు గతేడాది జులైలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక ఫలితాల వెల్లడిని ఆలస్యం చేయడం, కంపెనీ ఆడిటర్‌గా ఉన్న డెలాయిట్‌ హాస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ రాజీనామా వంటి పరిణామాల నేపథ్యంలో అప్పట్లో ఈ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని ఆదేశించినట్లు సదరు ఉన్నతాధికారి పేర్కొన్నారు. తనిఖీలకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ.. పైగా పన్ను మినహాయింపు.. VPF ప్రయోజనాలివే..!

మరోవైపు ఇప్పటికే బైజూస్‌ ఇతర చిక్కులు ఎదుర్కొంటోంది. కంపెనీ సీఈఓగా ఉన్న రవీంద్రన్‌తో పాటు, బోర్డులో ఉన్న కుటుంబసభ్యులను తొలగించాలని మెజారిటీ వాటాదారులు అసాధారణ సమావేశంలో తీర్మానం చేశారు. వాటాదారులు లేకుండా జరిగిన ఈ సమావేశం చెల్లుబాటు కాదని కంపెనీ పేర్కొంటోంది. ఈజీఎం నిర్ణయం అమల్లోకి రాకుండా కర్ణాటక హైకోర్టు స్టే విధించింది. మార్చి 13 తర్వాత ఈ వ్యవహారంపై ఓ స్పష్టత రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు