ఎఫ్‌డీ కంటే అధిక వడ్డీ.. పైగా పన్ను మినహాయింపు.. VPF ప్రయోజనాలివే..!

భవిష్యత్‌లో పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి వీపీఎఫ్‌ మంచి ఆప్షన్‌. ఇందులో మదుపు చేయడం వల్ల పన్ను మినహాయింపు సహా కొన్ని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Published : 26 Feb 2024 10:13 IST

VPF | ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేస్తున్నవారందరికీ ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ (EPF) గురించి తెలిసే ఉంటుంది. ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతాన్ని ఉద్యోగి భవిష్య నిధి ఖాతాకు (EPF) జమ చేస్తారు. అంతే మొత్తాన్ని సంస్థ జోడిస్తుంది. ఈ నిధిపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం చొప్పున వడ్డీని ఈపీఎఫ్‌ఓ ఖరారు చేసింది. అంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ప్రస్తుతం బ్యాంకులు అందిస్తున్న అత్యధిక వడ్డీ కంటే ఇది ఎక్కువే. ఒకవేళ ఎఫ్‌డీ కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ అందుకుంటూ.. భవిష్యత్‌లో పెద్ద మొత్తం నిధిని సమకూర్చుకోవాలనుకునే వారికి వాలంటరీ ప్రావిడెండ్‌ ఫండ్‌ (VPF) సరైన ఎంపిక అవుతుంది. ఇంతకీ ఏమిటీ వీపీఎఫ్‌? ఎలా జమ చేయాలి? ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో వీపీఎఫ్‌ (VPF) కూడా ఒకటి. పేరుకు తగ్గట్టుగా ఇందులో జమ చేయడం పూర్తిగా స్వచ్ఛందం. ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలోనే ఈ మొత్తం కూడా జమ అవుతుంది. అంటే నెలనెలా ఉద్యోగి పొదుపు చేసే మొత్తానికి అదనపు మొత్తాన్ని జమ చేయడానికి వీలు పడుతుంది. ఈపీఎఫ్‌ నిధికి వర్తించే వడ్డీనే దీనికీ వర్తిస్తుంది. వివిధ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. గరిష్ఠంగా మూల వేతనం+ డీఏకు సమానంగా వీపీఎఫ్‌ మొత్తాన్ని జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈపీఎఫ్‌ తరహాలోనే వీపీఎఫ్‌కూ ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ వర్తిస్తుంది. రిటైర్మెంట్‌, వైద్య అవసరాలు, గృహనిర్మాణం వంటి అవసరాలు ఏర్పడినప్పుడు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

LIC Amritbaal: ఎల్‌ఐసీ నుంచి కొత్త చిల్డ్రన్‌ ప్లాన్‌.. ఐదేళ్లు కడితే చాలు!

వీపీఎఫ్‌తో ప్రయోజనాలు ఇవే..

  • అధిక వడ్డీ: వీపీఎఫ్‌లో సొమ్ము జమ చేయడం ద్వారా మంచి వడ్డీ పొందొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ వడ్డీ 8.25 శాతంగా ఖరారైంది. అంతకుముందు ఏడాది 8.15 శాతంగా ఉంది. ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు మారినప్పటికీ.. ఈ వడ్డీ గత కొన్నేళ్లు 8 శాతానికి తగ్గడం లేదు. బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీపీఎఫ్‌తో (7.1%) పోలిస్తే ఇది ఎక్కువే.
  • పన్ను మినహాయింపు: పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌లో జమ చేసిన మొత్తాలకు సెక్షన్‌ 80సి కింద మినహాయింపు ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. గృహరుణం లేని వారు వీపీఎఫ్‌ ఆప్షన్‌ ఎంచుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.
  • మెచ్యూరిటీపైనా పన్నుల్లేవ్‌: అత్యధిక రిటర్నులు ఇచ్చే పెట్టుబడి సాధనాల్లో మదుపు చేసేటప్పుడు వచ్చే మూలధన లాభాలపై పన్ను చెల్లించాలి. వీపీఎఫ్‌లో మదుపు చేస్తే పూర్తిగా పన్ను రహితం. దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూరిన నిధులను తీసుకునేటప్పుడు ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.
  • ప్రభుత్వ హామీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఈక్విటీ మార్కెట్లలో మెరుగైన రాబడి ఉండొచ్చు. అదే సమయంలో నష్టభయం కూడా ఉంటుంది. ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి.. మనం జమ చేసే నిధికి ఎలాంటి ఢోకా ఉండదు.
  • జమ చేయడం సులువు: వీపీఎఫ్‌లో జమ చేయడం కూడా చాలా సులువు. హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌ను కలిసి వీపీఎఫ్‌ ఎంత జమ చేయాలనుకుంటున్నారో తెలుపుతూ దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. నెలనెలా ఆ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన వేతనాన్ని మీ ఖాతాలో జమ చేస్తారు.
  • పొదుపు అలవాటు: చేతికి సొమ్ములు వచ్చాక మదుపు చేయడం కొందరికి కుదరని పని. జీతం రాగానే ఆ మొత్తం ఇట్టే ఖర్చయిపోతుంది. అలాంటి వారు పొదుపును అలవాటుగా మార్చుకునేందుకు వీఎపీఎఫ్‌ పనికొస్తుంది.

చివరిగా: వీపీఎఫ్‌లో జమ చేయడం వల్ల మీ చేతికొచ్చే నెలవారీ జీతం తగ్గుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇంటి అవసరాలు తీరగా.. ఎంతమొత్తం పొదుపు చేయగలరో ముందే సమీక్షించుకోవాలి. మధ్యలో ఈఎంఐలో ఏదైనా కొనుగోలు చేయాల్సి వచ్చినా ఇంటి బడ్జెట్‌ దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని