Wheat: గోధుమ ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు.. నిల్వల పరిమితి మరింత కుదింపు

Wheat: టోకు, రిటైల్‌, బిగ్‌ చైన్‌ రిటైల్‌ వ్యాపారుల వద్ద ఉండాల్సిన గోధుమల నిల్వల పరిమితిని మరింత కుదిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 08 Dec 2023 19:07 IST

దిల్లీ: ఆహార ద్రవ్యోల్బణ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సర్కార్‌.. తాజాగా గోధుమ నిల్వల (Wheat Stocks)పై ఆంక్షలను కఠినతరం చేసింది. టోకు, రిటైల్‌, బిగ్‌ చైన్‌ రిటైల్‌ వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వల పరిమితిని మరింత కుదిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా వెల్లడించారు.

గోధుమల నిల్వలపై ఉన్న పరిమితి (Wheat Stock limits)ని టోకు వ్యాపారులకు 2,000 టన్నుల నుంచి 1,000 టన్నులకు కుదిస్తున్నట్లు చోప్రా తెలిపారు. అదే సమయంలో రిటైలర్లకు ఈ మొత్తాన్ని పది టన్నుల నుంచి ఐదు టన్నులకు కుదించారు. అలాగే బిగ్‌ చైన్‌ రిటైలర్లకు ఒక్కో డిపోపై ఐదు టన్నుల చొప్పున వారి అన్ని డిపోల్లో 1,000 టన్నుల పరిమితిని నిర్దేశించారు. మరోవైపు గోధుమలను ప్రాసెసింగ్‌ చేసేవారు నెలవారీ సంస్థాగత సామర్థ్యంలో 70 శాతం చొప్పున.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు.

కృత్రిమ కొరతను సృష్టించి అక్రమంగా ధరలను పెంచేందుకు చేస్తున్న యత్నాలను అరికట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చోప్రా తెలిపారు. ప్రస్తుతం ఉన్న నిల్వలను తాజా పరిమితుల మేరకు సర్దుబాటు చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చారు. గోధుమలను నిల్వ చేసుకునే అవసరం ఉన్న సంస్థలన్నీ ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపారు. ప్రతి శుక్రవారం నిల్వల స్థితిని అప్‌డేట్‌ చేయాలని చెప్పారు.

తాజా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చోప్రా స్పష్టం చేశారు. తొలిసారి గోధుమ నిల్వలపై ఆంక్షలు విధిస్తూ జూన్‌ 12న ప్రభుత్వం ప్రకటన చేసింది. మార్చి 2024 వరకు వాటిని కొనసాగిస్తామని తెలిపింది.

దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) పెరిగిన నేపథ్యంలో.. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈరోజు నుంచే నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని