Unclaimed Deposits: ఆ డిపాజిట్లలో మీ డబ్బూ ఉందా?

Eenadu icon
By Business News Team Updated : 10 Oct 2025 12:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

బ్యాంకు డిపాజిట్లు, బీమా పథకాలు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు.. ఇలా పలు పెట్టుబడి పథకాల్లో ఎవరూ క్లెయిం చేయని మొత్తం దాదాపు రూ.1.84 లక్షల కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తాన్ని అసలైన హక్కుదార్లకు చేర్చాలనే లక్ష్యంతో ‘మీ డబ్బు-మీ హక్కు’ అనే ప్రచారాన్నీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టి, మర్చిపోయిన లేదా వ్యవధి తీరాక క్లెయిం చేసుకోని డబ్బును తిరిగి పొందడం ఎలా అనే వివరాలను తెలుసుకుందాం.

భవిష్యత్తు భద్రంగా ఉండాలని పెట్టుబడులు పెడుతుంటాం. వాటి గురించి పట్టించుకోకుండా అలాగే వదిలేయడం ఎప్పుడూ మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో పెట్టుబడులు పెట్టిన వారు మరణించడం, ఆ డబ్బు గురించి వారసులకు తెలియకపోవడంలాంటివీ ఉంటాయి. కొన్నేళ్లుగా ఇలా డబ్బు పలు ఆర్థిక సంస్థల దగ్గర ఉండిపోతోంది.

బ్యాంకుల్లో..

అనేక బ్యాంకుల్లో క్లెయిం చేయని డిపాజిట్లను గుర్తించడం కోసం ఆర్‌బీఐ ‘ఉద్గమ్‌’ పోర్టల్‌ను ప్రారంభించింది. 

  • మీ మొబైల్‌ నంబరును ఉపయోగించి, పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 
  • ఖాతాదారుని పేరు, కనీసం ఒక గుర్తింపు వివరం (పాన్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్సు, పాస్‌పోర్ట్, పుట్టిన తేదీ) నమోదు చేయాలి.
  • వివరాలు సరిపోతే పోర్టల్‌లో బ్యాంకు పేరు, ఖాతా రకం, శాఖ వివరాలను చూపిస్తుంది.
  • చాలా బ్యాంకులు తమ వెబ్‌సైట్లలో క్లెయిం చేయని డిపాజిట్లను వెతికే సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించడం ద్వారా మర్చిపోయిన ఖాతాలను గుర్తించేందుకు వీలుంటుంది. 

ఏం చేయాలి?

క్లెయిం చేయని డిపాజిట్‌ను గుర్తించిన తర్వాత ఆ బ్యాంకు శాఖకు వెళ్లాలి. బ్యాంకు క్లెయిం ఫారాన్ని అందిస్తుంది. దీన్ని పూర్తి చేయాలి. దీంతోపాటు అవసరమైన అన్ని పత్రాలనూ సమర్పించాలి.

ఖాతాదారుడు సొంతంగా క్లెయిం చేస్తుంటే.. ఆధార్, పాన్, పాస్‌పోర్టు, లైసెన్సులాంటి ధ్రువీకరణలు కావాల్సి ఉంటుంది. చట్టపరమైన వారసులు/నామినీలు క్లెయిం చేస్తే, ఖాతాదారు మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, వారసత్వ ధ్రువీకరణలాంటివి సమర్పించాలి. 

అన్ని వివరాలూ పరిశీలించిన తర్వాత బ్యాంకు క్లెయింను పరిష్కరిస్తుంది. దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

బీమా పాలసీలు..

జీవిత బీమా సంస్థల దగ్గర క్లెయిం చేయని పాలసీలకు సంబంధించి జాబితా ఉంటుంది. బీమా సంస్థను సంప్రదించి, పాలసీదారుడి పుట్టిన తేదీ, మొబైల్‌ నంబరు ఆధారంగా పాలసీని తెలుసుకోవచ్చు.

మ్యూచువల్‌ ఫండ్లు

అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీ), భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) తమ వెబ్‌సైట్లలో క్లెయిం చేయని పెట్టుబడుల వివరాలు అందిస్తాయి. 
మీ ఫోలియో నంబరు, బ్యాంకు ఖాతా, కేవైసీ డాక్యుమెంట్లతో నేరుగా ఫండ్‌ సంస్థ లేదా రిజిస్ట్రార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఏజెంట్‌ను సంప్రదించండి. 
నామినీ లేదా చట్టపరమైన వారసులుగా క్లెయిం చేస్తుంటే, మొదట యూనిట్లను మీ పేరు మీదకు బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. ఆ తర్వాత ఆ ఫండ్లను క్లెయిం చేసుకోవచ్చు.

షేర్లు-డివిడెండ్‌

ఇన్వెస్టర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌ అథారిటీ (ఐఈపీఎఫ్‌ఏ)కి బదిలీ చేసిన షేర్లు, డివిడెండ్ల కోసం అధికారిక ఐఈపీఎఫ్‌ఏ వెబ్‌సైటును సంప్రదించాలి. ఐఈపీఎఫ్‌-5 ఫారాన్ని ఆన్‌లైన్‌లో దాఖలు చేయాలి. ఆ తర్వాత కంపెనీ నోడల్‌ ఆఫీసర్‌కు మీ దగ్గరున్న ఫిజికల్‌ షేర్లను పంపించాలి. ధ్రువీకరణ తర్వాత ఐఈపీఎఫ్‌ఏ రిఫండును ప్రారంభిస్తుంది. షేర్లను డీమ్యాట్‌ ఖాతాకు బదిలీ చేస్తుంది.

  • ఐఆర్‌డీఏఐ ప్రత్యేకంగా బీమా భరోసా పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో క్లెయిం చేయని మొత్తాలను చూపించే బీమా సంస్థల వెబ్‌సైట్లకు సంబంధించిన లింకులు ఉంటాయి.
  • పాలసీలకు సంబంధించిన సమాచారం లభించిన తర్వాత బీమా సంస్థ కార్యాలయం లేదా వెబ్‌సైట్‌ నుంచి క్లెయిం దరఖాస్తు పత్రాన్ని తీసుకోవాలి. దీన్ని పూర్తి చేసి, అవసరమైన పత్రాలను జత చేసి, బీమా కార్యాలయంలో సమర్పించండి.
Tags :
Published : 10 Oct 2025 04:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు