ఓటీపీ రూటు మారితే అలర్ట్‌.. సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టేందుకు కొత్త అస్త్రం!

OTP frauds: ఓటీపీ స్కామ్‌లకు చెక్‌ పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందులోభాగంగానే టెలికాం, ఎస్‌బీఐ కార్డ్స్‌తో కలిసి పనిచేస్తోంది.

Published : 23 Apr 2024 19:09 IST

OTP frauds | ఇంటర్నెట్‌డెస్క్‌: డిజిటలైజేషన్‌ మూలంగా మన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత సులభతరం అయ్యిందో.. సైబర్‌ నేరాలూ అదే స్థాయిలో పెరిగాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితం ఉండడం లేదు. ముఖ్యంగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP) మాటున జరిగే మోసాలు కోకొల్లలు. ఈనేపథ్యంలో ఓటీపీ సాయంతో మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఓ వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. అందులోభాగంగానే కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. ఎస్‌బీఐ కార్డ్స్‌, టెలికాం ఆపరేటర్లు జట్టుకట్టినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారిని ఉద్దేశిస్తూ ఎనకమిక్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది.

వాట్సప్‌లో కొత్త ఫీచర్‌.. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!

సాధారణంగా లావాదేవీలు జరపాలంటే రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ కస్టమర్‌ ఏ ప్రాంతంలో ఉన్నాడనే విషయంతో సంబంధం ఉండదు. అయితే ఇకపై ఓటీపీ వచ్చే సమయంలో రిజిస్టర్‌ అడ్రస్‌తో పాటు కస్టమర్‌ ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని (geo location) ట్రాక్‌ చేసేందుకు బ్యాంకులకు అనుమతివ్వాలని కేంద్రం యోచిస్తోంది. ఈ రెండు లొకేషన్ల మధ్య ఏదైనా వ్యత్యాసం అనిపిస్తే ఫిషింగ్‌ దాడి జరిగే అవకాశం ఉందని కస్టమర్‌కు హెచ్చరిక జారీ అవుతుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి హైదరాబాద్‌లో నివసిస్తున్నాడనుకుందాం. ఆ వ్యక్తి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు రావాల్సిన ఓటీపీ ఎక్కడో రాజస్థాన్‌కు వెళితే.. ఆ కస్టమర్‌కు అలర్ట్‌ వెళుతుంది. ఇప్పటివరకు ఆ ప్రాంతంతో సంబంధం లేకపోయినా, మునుపెన్నడూ ప్రయాణించని ప్రాంతమైనా ఈ సందేశం యూజర్‌కు చేరుతుంది.

టెలికాం డేటాబేస్‌ సాయంతో కస్టమర్‌ ఉన్న లొకేషన్‌ ట్రాక్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీపీ డెలివరీ లొకేషన్‌లో ఏదైనా తేడా గుర్తిస్తే.. వెంటనే యూజర్‌ను అప్రమత్తం చేస్తూ ఒక పాపప్‌ మెసేజ్‌ పంపుతారు. లేదా ఓటీపీని పూర్తిగా బ్లాక్‌ చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ సేవలు ఇంకా టెస్టింగ్‌ దశలోనే ఉన్నట్లు పేర్కొన్నాయి. ఈవిషయంపై కేంద్ర హోం శాఖ, ఎస్‌బీఐ కార్డ్స్‌ గానీ స్పందించలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని