Budget 2024: మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్‌ స్కీమ్‌

New housing scheme: పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కోటి ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌నూ ఈ సందర్భంగా ప్రకటించారు.

Updated : 09 Jul 2024 15:33 IST

Housing scheme | దిల్లీ: మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్‌ (Union budget 2024) ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌’ కరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు.

కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్‌లో నూతన పథకాన్ని ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకం గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని