GST collections: ఆగస్టు జీఎస్టీ వసూళ్లలో 11 శాతం వృద్ధి

GST collections in August: ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు 1.59 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే 11 శాతం మేర పెరిగాయి.

Published : 01 Sep 2023 18:19 IST

దిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST collections) భారీగానే నమోదయ్యాయి. ఆగస్టు నెలలో రూ.1.59 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే వసూళ్లు 11 శాతం మేర పెరిగాయి. గతేడాది ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు రూ.1.43 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.28,328 కోట్లు, ఎస్‌జీఎస్టీ వాటా రూ.35,794  కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ వసూళ్లు రూ.83,251 కోట్లు చొప్పున ఉన్నాయి. పన్ను ఎగవేతలు తగ్గడం వసూళ్లు పెరగడానికి కారణమని ప్రభుత్వం పేర్కొంది. పండగ సీజన్‌ నేపథ్యంలో రాబోయే నెలల్లో జీఎస్టీ వసూళ్లు మరింత పెరగనున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.

ఏపీ, తెలంగాణ ఇలా..

ఇక తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల విషయానికొస్తే.. రెండు రాష్ట్రాలూ రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. ఏపీలో గతేడాది ఆగస్టులో రూ.3,173 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ఈ ఏడాది 10 శాతం మేర వృద్ధితో రూ.3479 కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణ సైతం 13 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది రూ.3,871 కోట్లుగా ఉన్న వసూళ్లు రూ.4,393 కోట్లకు పెరిగాయి. ఎప్పటిలానే 23 శాతం వృద్ధితో మహారాష్ట్ర రూ.23,282 కోట్ల వసూళ్లతో వసూళ్లలో అగ్రస్థానంలో నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని