HCL: లేఆఫ్‌ల వేళ.. నియామకాలు చేపట్టనున్న ఐటీ సంస్థ

ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నప్పటికీ.. ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రముఖ ఐటీ సంస్థ (IT Company) హెచ్‌సీఎల్‌ (HCL) ప్రకటించింది. లేఆఫ్‌లు కొనసాగుతున్న వేళ హెచ్‌సీఎల్‌ ప్రకటన కొంత ఊరటనిచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published : 31 Mar 2023 19:53 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఐటీ దిగ్గజ సంస్థలు (IT Companies) ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. ట్విటర్‌, అమెజాన్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, ఎరిక్సన్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున లేఆఫ్‌లు (Layoffs) విధిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు కొంతకాలంపాటు ఉద్యోగ నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఉద్యోగం పోతే మరో సంస్థలో కొలువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ (HCL) కీలక ప్రకటన చేసింది. ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్నప్పటికీ.. ఉద్యోగ నియామకాలు చేపడతామని ప్రకటించింది. రాబోయే రెండేళ్లలో సుమారు 1,000 ఉద్యోగ నియామకాలు చేపడతామని వెల్లడించింది. అయితే, ఈ నియామకాలు రొమేనియాలో ఉంటాయని తెలిపింది. 

గత ఐదేళ్లుగా హెచ్‌సీఎల్‌ సంస్థ రొమేనియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ రంగంలో కెరీర్‌ ప్రారంభించాలనుకునే వారికి తమ సంస్థ శిక్షణ ఇచ్చి ఉద్యోగాన్ని ఆఫర్‌ చేస్తుందని ప్రకటించింది. ఇందుకోసం రోమేనియన్‌ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఒకవైపు ఐటీ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతుండగా, హెచ్‌సీఎల్‌ వంటి సంస్థలు నియామకాలపై ప్రకటన చేయడం కొంత ఊరటనిచ్చే అంశమని ఐటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని