HDFC Bank Q4 results: హెచ్‌డీఎఫ్‌సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో రూ.17,622 కోట్ల నికర లాభాన్ని నమోదుచేసింది.

Published : 20 Apr 2024 17:26 IST

ముంబయి: దేశంలోనే అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC bank) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం చివరికి త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత ప్రాతిపదికన రూ.17,622.38 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.17,257.87 కోట్లతో లాభం 2.11 శాతం మేర పెరిగింది. స్టాండర్డ్‌లోన్‌ పద్ధతిలో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.16,372.54 కోట్ల నుంచి రూ.16,511.85 కోట్లకు పెరిగింది. పూర్తి సంవత్సరానికి రూ.64,060 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 

2023 జులైలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హోమ్‌లోన్‌ విభాగమైన హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ విలీనమైన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది త్రైమాసిక ఫలితాలను పోల్చడం లేదు. సమీక్ష త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.47,240 కోట్లుగా నమోదైంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ విక్రయం ద్వారా వచ్చిన రూ.7,340 కోట్ల ఆదాయం కూడా ఇందులో ఇమిడి ఉంది. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం రూ.29,080 కోట్లు వచ్చినట్లు బ్యాంకు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇతర ఆదాయం రూ.18,170 కోట్లుగా వెల్లడించింది. ఇక స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 1.26 శాతం నుంచి 1.24 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. పూర్తి సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.19.5 చొప్పున చెల్లించేందుకు బోర్డు సిఫార్సు చేసినట్లు తెలిపింది. శుక్రవారం మార్కెట్ ముగిసేసరికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 2.46 శాతం లాభంతో రూ.1,531.30 వద్ద ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని