HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ యూపీఐ పేమెంట్స్‌.. ఇక ఆ లావాదేవీలకు SMS అలర్ట్‌లు ఉండవు

HDFC Bank: చిన్న చిన్న లావాదేవీలకు ఎసెమ్మెస్‌ అలర్ట్‌లు అందించబోమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తెలిపింది. ఈమెయిల్‌ నోటిఫికేషన్లు మాత్రం యథావిధిగా అందుతాయని తెలిపింది.

Published : 29 May 2024 15:28 IST

ముంబయి: యూపీఐ లావాదేవీల విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ విలువ చేసే ట్రాన్సాక్షన్స్‌కు (UPI Transactions) ఇకపై ఎస్సెమ్మెస్‌ ద్వారా అలర్ట్‌లు అందించబోమని తెలిపింది. ఈమేరకు తమ కస్టమర్లకు ఎస్సెమ్మెస్‌, ఈమెయిల్‌ ద్వారా సందేశాలు పంపింది. 2024 జూన్‌ 25 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపింది.

రూ.100 కంటే తక్కువ చేసే చెల్లింపులపై ఇకపై ఎస్సెమ్మెస్‌ ద్వారా సందేశాలు పంపబోమని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) స్పష్టంచేసింది. అలాగే రూ.500 కంటే తక్కువ డిపాజిట్లకు కూడా అలర్ట్‌లు ఉండవని తెలిపింది. అయితే, విలువతో సంబంధం లేకుండా అన్ని యూపీఐ లావాదేవీలకు ఎస్సెమ్మెస్‌, ఈమెయిల్‌ సందేశాలు కచ్చితంగా అందుతాయని తెలిపింది. కస్టమర్ల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్‌ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. యూపీఐ (UPI) యాప్‌ల నుంచి ఎలాగూ నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యంలో చిన్న మొత్తం లావాదేవీలకు ప్రత్యేకంగా అలర్ట్‌లు అవసరం లేదని పలువురు ఖాతాదారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

చిన్నచిన్న లావాదేవీలకు సైతం ఎస్సెమ్మెస్‌లు పంపడం వల్ల రోజుకు కోట్లాది సందేశాలు కస్టమర్లకు చేరుతున్నాయి. దీని కోసం ఆయా బ్యాంకులు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తోంది. తాజా నిర్ణయంతో హెచ్‌డీఎఫ్‌సీకి ఆ మేరకు కొంత నిర్వహణ వ్యయం తగ్గనుంది. మరోవైపు ఖాతాదారులంతా తమ ప్రైమరీ ఈమెయిల్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని బ్యాంకు సూచించింది.

మరోవైపు బ్యాంకులు ఇప్పటికే యూపీఐ లైట్‌ను (UPI Lite) ప్రమోట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిద్వారా యాప్‌లోనే రూ.500 వరకు పక్కన పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా టూ-ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ లేకుండానే వేగంగా లావాదేవీలు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని