సంరక్షకుడికి రూ.97వేల కోట్ల ఆస్తి.. రాసివ్వనున్న బిలియనీర్‌!

Nicolas Puech: వృద్ధాప్యంలో తన బాగోగులు చూసుకున్న సంరక్షకుడిని.. రూ.వేల కోట్ల ఆస్తి (Fortune)కి వారసుడిని చేస్తున్నారో బిలియనీర్‌. రూ.97వేల కోట్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు.

Published : 09 Dec 2023 14:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ కుబేరుడు మంచి మనసు చాటుకున్నారు. వృద్ధాప్యంలో తనను కంటికి రెప్పలా చూసుకున్న సంరక్షకుడిని దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తన 11 బిలియన్‌ డాలర్ల ఆస్తిని అతడి పేరుపై రాయబోతున్నారు. ఈ మేరకు స్విస్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ హెర్మెస్‌ (Hermes)ను 1837లో థియెర్రీ హెర్మెస్‌ స్థాపించారు. థియెర్రీ కుటుంబంలో ఐదో తరానికి చెందిన వారసుడు నికోలస్‌ ప్యూచ్‌ (Nicolas Puech). 80ఏళ్ల నికోలస్‌కు హెర్మెస్‌ కంపెనీలో 5-6శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ దాదాపు 11 బిలియన్‌ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.97వేల కోట్లకు పైమాటే). అయితే, నికోలస్‌కు వివాహం కాలేదు. వారసులెవరూ లేకపోవడంతో ఆయన తదనానంతరం ఆ ఆస్తంతా ఎవరికి దక్కబోతుందనే దానిపై స్థానికంగా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలోనే తన ఆస్తికి వారసుడి విషయంలో నికోలస్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు స్విస్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా తన బాగోగులు చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడిని నికోలస్‌ దత్తత తీసుకునేందుకు సిద్ధమైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇందుకోసం ఆయన ఓ న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారట. చట్టప్రకారం దత్తత పూర్తయిన తర్వాత ఆ సంరక్షకుడికి తన 11 బిలియన్‌ డాలర్ల ఆస్తిని వారసత్వంగా అప్పగించనున్నట్లు సమాచారం. అయితే, ఆ సంరక్షకుడి పేరును మాత్రం సదరు కథనాలు వెల్లడించలేదు. అతడికి పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నట్లు మాత్రం తెలిపాయి. ఇప్పటికే ఆ సంరక్షకుడికి నికోలస్‌ 5.9 మిలియన్‌ డాలర్ల విలువైన తన ఆస్తులను అప్పగించినట్లు సమాచారం. మొరాకో, మాంట్రియక్స్‌ వంటి నగరాల్లోని కొన్ని ఆస్తుల తాళాలను అతడికి ఇచ్చేశారట.

కుటుంబ తగాదాల వల్లే..

కుటుంబ తగాదాల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014లో హెర్మెస్‌ సూపర్‌వైజరీ బోర్డ్‌ నుంచి నికోలస్‌ అర్ధంతరంగా వైదొలిగారు. ఆ ఏడాది మరో ఫ్యాషన్‌ కంపెనీ ఎల్‌వీఎంహెచ్‌.. హెర్మెస్‌ కంపెనీలో బలవంతంగా 23శాతం వాటాలను దక్కించుకుంది. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హెర్మెస్‌ కుటుంబసభ్యులు.. కంపెనీలోని తమ వాటాలతో ఓ హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయగా.. నికోలస్‌ మాత్రం తన వాటాను అట్టిపెట్టుకున్నారు. ఇది కుటుంబంలో విభేదాలకు కారణమైంది. ఆ తర్వాత నికోలస్‌.. బోర్డు నుంచి వైదొలిగారు. దీంతోనే.. నికోలస్‌ తన ఆస్తులపై ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.

అయితే, తన వారసత్వ ప్రణాళికను అమలు చేసేందుకు నికోలస్ చట్టపరంగా సవాళ్లను ఎదుర్కొనేలా కన్పిస్తోంది. స్విట్జర్లాండ్‌లో పెద్దవాళ్లను దత్తత తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. దత్తత వెళ్లే వ్యక్తి మైనర్‌గా ఉన్నప్పుడు కనీసం ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకునేవ్యక్తి ఆ మైనర్‌తో కలిసి జీవించి ఉండాలి. మరోవైపు.. నికోలస్‌ ఆ సంరక్షకుడిని దత్తత తీసుకుంటే.. దానిపై హెర్మెస్‌ కుటుంబసభ్యులు కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని