Real estate: ₹కోటి పైన ఇళ్లకు గిరాకీ.. టాప్‌-3లో హైదరాబాద్‌!

కోటికి పైగా ధర కలిగిన ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. హైదరాబాద్‌ నగరం ఈ విషయంలో టాప్‌-3లో ఉంది.

Published : 04 Apr 2024 14:55 IST

Real estate | ఇంటర్నెట్‌ డెస్క్‌: కలల ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్రజలు ఖర్చుకు వెనకాడడం లేదు. సౌకర్యాలు ఉంటే చాలు ధర రూ.కోటైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరిగిన విక్రయాలే ఇందుకు నిదర్శనం. గత మూడు నెలల్లో జరిగిన మొత్తం ఇళ్ల విక్రయాల్లో వీటి వాటానే 40 శాతం కావడం గమనార్హం. ఆ సమయంలో రూ.50 లక్షల్లోపు ఇళ్ల అమ్మకాలు క్షీణించాయని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ (Knight Frank) తన నివేదికలో పేర్కొంది. రూ.కోటికి పైగా ధర కలిగిన ఇళ్ల విక్రయాలు గతేడాది క్యూ1లో 29 శాతం కాగా.. క్యూ2లో 31 శాతం, క్యూ3లో 35 శాతం, క్యూ4లో 39 శాతానికి పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

జనవరి నుంచి మార్చి మధ్య దేశంలోని ప్రధాన నగరాల్లో 86,345 యూనిట్లు విక్రయమైనట్లు నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. 2023 క్యూ4లో అత్యధికంగా 89,845 యూనిట్లు అమ్ముడవ్వగా.. రెండో అత్యధికం తాజాగా నమోదైనట్లు పేర్కొంది. మొత్తం విక్రయాల్లో కోటికి పైగా ధర కలిగిన 34,895 గృహాలు అమ్ముడైనట్లు నివేదిక తెలిపింది. సంఖ్యా పరంగా గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. ఇవి 51 శాతం అధికం. గతేడాది  ఇదే త్రైమాసికంలో రూ.50 లక్షల్లోపు ఉన్న గృహాలు 25,714 యూనిట్లు అమ్ముడవ్వగా.. ఈసారి ఆ సంఖ్య 23,026 యూనిట్లకు తగ్గింది. మొత్తం అమ్మకాల్లో ఈ వాటా 27 శాతంగా ఉంది.

రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ధర కలిగిన ఇళ్ల అమ్మకాలు 5 శాతం (28,424 యూనిట్లు) మేర తగ్గాయి. గతేడాది 38 శాతంగా ఉన్న వీటి విక్రయాలు 33 శాతానికి తగ్గాయి. ఇది బలమైన డిమాండ్‌ను సూచిస్తోందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బాలాజీ పేర్కొన్నారు. అలాగే, దీర్ఘకాలిక పెట్టుబడులపై సుముఖంగా ఉన్నారన్నది తెలియజేస్తోందన్నారు. కోటి రూపాయలకు పైగా విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు దేశ రాజధాని ప్రాంతం (NCR) దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో జనవరి - మార్చి మధ్య 10,558 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానాల్లో  ముంబయి (7,401), హైదరాబాద్‌ (6,112) ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని