Crypto crash: క్రిప్టో క్రాష్‌.. ఇంకా ఎంత దూరం?

అసలు క్రిప్టో కరెన్సీలు ఈ స్థాయి పతనం చవిచూడడానికి కారణం ఏంటి...

Published : 03 Jul 2022 10:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిప్టో కరెన్సీ (CryptoCurrency).. దాదాపు ఏడాది క్రితం అందరి నోళ్లలో నానిన పదం. అసలు ఏంటిది? దీని వెనకున్న సాంకేతికత ఎలా పనిచేస్తుంది? ఎలా మదుపు చేయాలి? దీంట్లో ఇప్పుడు పెట్టుబడి పెట్టకపోతే.. వెనుకబడినట్లేనా? భవిష్యత్తు లావాదేవీలన్నీ క్రిప్టో కరెన్సీల్లో (CryptoCurrency)నే జరగనున్నాయా? ఇలాంటి ప్రశ్నలు అనేక మందిని తొలచివేశాయి. ఈ క్రమంలోనే అనేక క్రిప్టో ట్రేడింగ్‌ వేదికలూ పుట్టుకొచ్చాయి. కానీ, ప్రస్తుత పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. క్రిప్టో (CryptoCurrency)లో మదుపంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.

క్రిప్టో మదుపు ద్వారా తక్కువ కాలంలో అసాధారణ రాబడి ఆర్జించాలని ఆశించిన వారికి ఇదొక గుణపాఠమనే చెప్పాలి. క్రిప్టోల్లో మదుపు చేసి ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలనుకున్న వారికీ ఇదొక మంచి అవగాహన. అసలు క్రిప్టో కరెన్సీ (CryptoCurrency)లు ఈ స్థాయి పతనం చవిచూడడానికి కారణం ఏంటి? ఈ దశాబ్దంలో వస్తున్న అతిపెద్ద మార్పుగా పేరొందిన బిట్‌కాయిన్‌ (Bitcoin) ఇప్పుడు ఉనికి కోసం ఎందుకు పోరాడుతోంది? ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మదుపర్ల పరిస్థితేంటి?

మంచి రోజులు..

క్రిప్టో మదుపర్ల జీవితాల్లో 2021 ఓ మరపురాని ఏడాదిగా చెప్పొచ్చు. నవంబరు 2021లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 69,000 డాలర్ల (రూ.54.5 లక్షలు) వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. ఏడాది చివరకు ఈ కాయిన్‌ లక్ష డాలర్లకు చేరనుందని అప్పట్లో అందరూ అంచనా వేశారు. కానీ, కొన్ని నెలల్లోనే అత్యంత గడ్డుకాలం రాబోతోందని మాత్రం ఎవరూ అంచనా వేయలేకపోయారు. 

కొత్త ఏడాది ఆరంభం నుంచే..

జనవరి 2022 నుంచే క్రిప్టోల పతనం ప్రారంభమైంది. ఆ నెలలో బిట్‌కాయిన్‌ (Bitcoin) విలువ 2 ట్రిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఏప్రిల్‌లో కొద్దిగా కోలుకున్నప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితి యథావిధి అన్నట్లే సాగింది. ఇప్పటి వరకు బిట్‌కాయిన్‌ (Bitcoin) గరిష్ఠాల నుంచి 70 శాతం పతనమైంది. ఆదివారం (3 జులై 2022) ఉదయం 9:38 గంటల సమయంలో బిట్‌కాయిన్‌ విలువ 19,260 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డోజేకాయిన్‌, అవలాంచే, సొలానా వంటి క్రిప్టోలైతే 90 శాతం వరకు పతనాన్ని చవిచూస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ విలువ 890 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

క్రిప్టోకు ధరాఘాతం..

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఎగబాకడమే క్రిప్టోల పతనానికి ప్రధాన కారణమని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధరల పెరుగుదలను అరికట్టేందుకు అమెరికా సహా ప్రపంచ దేశాలు వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఫలితంగా వ్యవస్థలో ద్రవ్య లభ్యత తగ్గి క్రిప్టోలో పెట్టుబడులు మందగించాయని అంచనా. ఇక స్టాక్‌ మార్కెట్లు సైతం 20 శాతానికి పైగా పతనమై బేర్‌ గుప్పిట్లోకి జారుకున్నాయి. 

ప్రభుత్వాలే సందిగ్ధంలో..

మరోవైపు వివిధ దేశాలు క్రిప్టో కరెన్సీల నియంత్రణ విషయంలో అనేక సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ లావాదేవీలను ట్రాక్‌ చేయడం కష్టమని భావించిన ప్రభుత్వాలు నిర్ధిష్టమైన నియమ నిబంధనల జోలికి వెళ్లకుండానే చేతులు దులుపుకున్నాయి. భారత్‌ సైతం బడ్జెట్‌లో క్రిప్టో నియంత్రణా బిల్లు తెస్తుందని భావించినప్పటికీ.. ఆ దిశగా అడుగులు వేయలేదు. పైగా క్రిప్టో సహా ఎన్‌ఎఫ్‌టీల లావాదేవీలపై ఫ్లాట్‌ 30 శాతం పన్ను విధించింది. మరోవైపు క్రిప్టో వ్యాలెట్లకు యూపీఐ బదిలీ అనుమతిని ఏప్రిల్‌లో రద్దు చేసింది. తాజాగా క్రిప్టో లావాదేవీలపై టీడీఎస్‌ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. పరోక్షంగా క్రిప్టోలో మదుపును అరికట్టడానికే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా.. చైనా, ఈజిప్టు తరహాలో భవిష్యత్తులో పూర్తిస్థాయి నిషేధం దిశగా ప్రభుత్వం పయనిస్తోందన్న ఊహాగానాలూ వెలువడుతున్నాయి. ఇతర దేశాలు సైతం ఇదే పంథాను అనుసరిస్తున్నాయి.

నష్టం మదుపర్లకే కాదు..

క్రిప్టో కరెన్సీల పతనంతో మదుపర్లే కాదు వీటి ఆధారంగా పుట్టుకొచ్చిన అనేక కంపెనీలు, ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, ఎక్స్ఛేంజీలు సైతం నిండా మునిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో హెడ్జ్‌ ఫండ్‌గా పేరుగాంచిన ‘త్రీ యారోస్‌ క్యాపిటల్‌ (3ఏసీ)’ దివాలా తీసింది. ఇది టెర్రా, బిట్‌కాయిన్‌ (Bitcoin), ఈథర్‌, సొలానా వంటి క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టింది. వోయేజర్‌, బ్లాక్‌ఫై వంటి సంస్థలు సైతం దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకున్నాయి. 

మరోవైపు క్రిప్టో ఎక్స్ఛేంజీలు భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీగా పేరుగాంచిన క్రిప్టో.కామ్‌ జూన్‌ 16న 400 మంది సిబ్బందిని తొలగించింది. మరోవైపు కాయిన్‌బేస్‌ తమ ఉద్యోగుల్లో 18 శాతం మందికి ఉద్వాసన పలికింది. భారత్‌లో ఇప్పటి వరకు ఎక్స్ఛేంజీలు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. చాలాకాలం ఇలా కొనసాగడం మాత్రం సాధ్యం కాదన్న విషయం సుస్పష్టం. 

ఇప్పుడు ఏం చేయాలి?

క్రిప్టోల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టడం అంత సురక్షితం కాదన్న విషయం ఇప్పుడు మదుపర్లందరికీ తెలిసొచ్చింది. ఈ నేపథ్యంలో డబ్బునంతా క్రిప్టోల్లో కాకుండా.. అదనంగా ఉన్న సొమ్మును మాత్రమే మదుపు చేయాలి. పరిస్థితులు అడ్డం తిరిగి డబ్బులు పూర్తిగా నష్ట పోయినా ఫరవాలేదనుకున్న సొమ్మును మాత్రమే క్రిప్టోల్లో పెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పైగా ఇలాంటి రిస్కీ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది. ఇతరుల ఒత్తిడితో కాకుండా సొంతంగా అధ్యయనం చేసి హేతుబద్ధంగా పెట్టుబడి పెడితేనే ప్రయోజనం.

ఆదరణ మాత్రం ఆగడం లేదు..

ఇంత పతనంలోనూ క్రిప్టోపై కొందరిలో మోజు మాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. అనేక మంది బిట్‌కాయిన్‌ (Bitcoin) మిలియనీర్లు తెరపై నుంచి కనుమరుగైనప్పటికీ.. కనీసం ఒక బిట్‌కాయిన్ కలిగి ఉండి వోల్‌కాయినర్లుగా పిలిచే వారి సంఖ్య ఇటీవల 13,000 పెరిగింది. మరోవైపు గత 20 రోజుల్లో 0.1 లేదా అంతకంటే ఎక్కువ బిట్‌కాయిన్లు సొంతం చేసుకున్నవారి సంఖ్య 2,50,000గా నమోదైంది. దీన్ని బట్టి ఇప్పటికీ క్రిప్టోల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కొంత మంది ఆసక్తి చూపిస్తున్నారన్నది సుస్పష్టం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని