Lakshadweep: ‘టార్గెట్‌ లక్షద్వీప్‌’ దిశగా బడ్జెట్‌లో అడుగులు..!

మాల్దీవులతో వివాదం వేళ కేంద్రం లక్షద్వీప్‌ పర్యటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించింది.

Updated : 09 Jul 2024 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాల్దీవులతో వివాదం రగులుతున్న వేళ లక్షద్వీప్‌ (Lakshadweep)ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.  2024 తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) లోక్‌సభకు వెల్లడించారు. ప్రభుత్వం ప్రముఖ పర్యటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. లక్షద్వీప్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని వెల్లడించారు.

‘‘పర్యటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. భారత్‌లోని 60 చోట్ల నిర్వహించిన జీ20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యటకులకు తెలియజేశాయి. మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు.. కాన్ఫరెన్స్‌ టూరిజాన్ని ఆకర్షించాలి. మన మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు ప్రయాణాలకు, కొత్త ప్రాంతాల అన్వేషణలకు ఉత్సాహంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యటకం కారణంగా స్థానిక వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తాం. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ చేస్తాం’’

‘‘వసతులు, నాణ్యమైన సేవలు ఆధారంగా ఈ పర్యటక కేంద్రాలకు రేటింగ్‌ ఇచ్చేలా ఒక ఫ్రేమ్‌ వర్క్‌ను సిద్ధం చేస్తాం. రాష్ట్రాలతో కలిసి దామాషా విధానంలో ఆ కేంద్రాల అభివృద్ధికి అవసరమైన ఫైనాన్సింగ్‌ సమకూరుస్తాం. దేశీయ పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పోర్టు కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రా, ఇతర వసతులను మన దీవుల్లో ఏర్పాటు చేస్తాము. వీటిల్లో లక్షద్వీప్‌ కూడా ఉంది. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుంది’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  తెలిపారు. 

‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’తో వార్తల్లోకి..

జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డైవింగ్‌, స్నార్కెలింగ్‌ చేశారు. ఆ విశేషాలను నాడు ఎక్స్‌ వేదికగా పంచుకొన్నారు. అక్కడి అందాలు తన మది దోచుకున్నాయన్నారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ జాబితాలో లక్షద్వీప్‌ను చేర్చాలని ఆయన కోరారు. ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రులు విషం కక్కారు. ప్రధాని, భారత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం రాజుకొంది. చాలా మంది భారతీయ సెలబ్రిటీలు లక్షద్వీప్‌ను ప్రమోట్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రముఖ పర్యటక వెబ్‌సైట్లు మాల్దీవుల ప్యాకేజీలను నిలిపివేశాయి. 

తాజాగా భారత్‌ నుంచి మాలెకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్‌ వేగంగా ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యటకులతో రష్యా తొలి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్‌ 14,588 మంది పర్యటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 

మన దేశంలోనూ అందాల దీవులు..

లక్షద్వీప్‌ ప్రాంతాన్ని ప్రపంచ పర్యటక హబ్‌గా తీర్చిదిద్దాలని కేంద్రం ఎప్పటి నుంచో భావిస్తోంది. తాజా వివాదం ప్రజల భావోద్వేగాలను బలంగా ప్రభావితం చేసింది. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేయడం విశేషం. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్షద్వీప్‌లో 35 దీవులు ఉన్నాయి. సెప్టెంబరు-మే మధ్యకాలంలో ఇక్కడి వాతావరణం పర్యటకానికి అత్యంత అనుకూలం. బీచ్‌లు, పగడపు దీవులు, సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే ఇది మాల్దీవులకు ఏమాత్రం తీసిపోదు. అయితే, మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. పర్యటకులు పెరిగినప్పుడు ప్లాస్టిక్‌, చెత్త పేరుకుపోతాయి. ఇవి దీవుల సహజత్వాన్ని, వాటి ప్రత్యేకతను దెబ్బతీసే ప్రమాదముంది. కాబట్టి లక్షద్వీప్‌, అండమాన్‌లలో టూరిజం ప్రాజెక్టులను పర్యావరణ హితకరమైన విధానాల్లో చేపట్టడం ఎంతో అవసరం. తాజా చర్యల్లో ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని