Startups: అంకురాలకు సానుకూలం హైదరాబాద్‌

అంకుర సంస్థలకు అత్యంత అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్‌ స్థానం సంపాదించింది. ఆసియా దేశాల్లో అంకుర సంస్థలకు అనుకూల పరిస్థితులు, సానుకూలత ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని స్టార్టప్‌ జీనోమ్‌ అనే సంస్థ రూపొందించిన ‘2024 గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌’ నివేదిక స్పష్టం చేసింది.

Published : 12 Jun 2024 03:11 IST

ఇప్పటికే 7500 సంస్థలు

ఈనాడు, హైదరాబాద్‌: అంకుర సంస్థలకు అత్యంత అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్‌ స్థానం సంపాదించింది. ఆసియా దేశాల్లో అంకుర సంస్థలకు అనుకూల పరిస్థితులు, సానుకూలత ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని స్టార్టప్‌ జీనోమ్‌ అనే సంస్థ రూపొందించిన ‘2024 గ్లోబల్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌’ నివేదిక స్పష్టం చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్‌ 19వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉండగా.. 6వ స్థానంలో బెంగళూరు, 7వ స్థానంలో దిల్లీ, 10వ స్థానంలో ముంబయి నగరాలు ఉన్నాయి. పుణె నగరం 26వ స్థానం సంపాదించింది.

5 అంశాల ఆధారంగా: ప్రధానంగా 5 అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించారు. అంకుర సంస్థల సామర్థ్యం, నిధుల లభ్యత, మానవ వనరుల నైపుణ్యాలు- అనుభవం, మార్కెట్‌కు దగ్గర కావడం, విజ్ఞానం.. ఇందులో ఉన్నాయి. దశాబ్దకాలం క్రితం హైదరాబాద్‌లో అంకుర సంస్థల సంఖ్య 200 మాత్రమే. తదుపరి అంకుర సంస్థలు పెద్ద సంఖ్యలో ఆవిర్భవించి, ఎంతో పేరు ప్రతిష్ఠలు సంపాదించాయి. ఇప్పుడు దాదాపు 7,500 కు పైగా అంకుర సంస్థలకు హైదరాబాద్‌ కేంద్ర స్థానంగా ఉంది. త్వరలో ఈ సంఖ్య పది వేలకు చేరుకునే అవకాశం లేకపోలేదు. ‘యూనికార్న్‌’ (100 కోట్ల డాలర్లు - రూ.8300 కోట్ల విలువైన సంస్థ) హోదా పొందిన అంకుర సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉండటం ప్రత్యేకత. 

హైదరాబాద్‌కు మరొక ప్రత్యేకత కూడా దక్కింది. ఆసియా దేశాల్లో అంకుర సంస్థలకు ‘బెస్ట్‌ ఎమర్జింగ్‌ ఎకోసిస్టమ్‌’ ఉన్న నగరాల జాబితాలోనూ హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంది. ప్రాథమిక దశలో ఉన్న అంకుర సంస్థలు సత్వరం ఎదిగేందుకు దోహదపడే పరిస్థితులు హైదరాబాద్‌లో ఉండటాన్ని ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని