UPI ID: యూపీఐ ఐడీలు వాడడం లేదా.. అయితే మీకో అలర్ట్‌!

NPCI guidelines on UPI IDs: యూపీఐ లావాదేవీలకు సంబంధించి ఎన్‌పీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడాదికి పైగా వాడకుండా ఉన్న యూపీఐ ఐడీలను, నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది.

Updated : 17 Nov 2023 20:35 IST

UPI IDs: ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరికైనా డబ్బులు పంపాలంటే ఒకప్పుడు బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ తప్పనిసరి. ఇప్పుడు మాత్రం యూపీఐ ఐడీ (UPI ID) ఉంటే చాలు.. ఇట్టే డబ్బులు పంపొచ్చు. అకౌంట్‌ ఒకటే ఉన్నా వేర్వేరు యూపీఐ ఐడీలు ఉండొచ్చు. ఇలా చాలా మందికి ఫోన్‌ నంబర్‌తో, మెయిల్‌ ఐడీతో ఒకటికి మించే యూపీఐ ఐడీలు ఉంటున్నాయి. అయితే, అందులో రెగ్యులర్‌గా వాడేవి కొన్నయితే.. వాడకుండా వదిలేసినవి చాలానే ఉంటున్నాయి. అలాంటి యూపీఐ ఐడీలు, ఫోన్‌ నంబర్ల విషయంలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి పైగా వాడని యూపీఐ ఐడీలు, నంబర్లు డీయాక్టివేట్‌ చేయాలని నిర్ణయించింది.

ఏడాదికి పైగా ఎటువంటి లావాదేవీలకూ వినియోగించని యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లు, ఫోన్‌ నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ ఎన్‌పీసీఐ తాజాగా గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే యాప్స్‌, బ్యాంకులకు సూచించింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది. దీనివల్ల పొరపాటున వేరొకరికి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. సాధారణంగా వ్యక్తులు ఫోన్‌ నంబర్లను మారుస్తూ ఉంటారు. బ్యాంక్‌ ఖాతాలకు ఉన్న లింకులను తొలగించరు. అలా వాడని మొబైల్‌ నంబర్‌ కొన్నాళ్లకు టెలికాం సంస్థలు వేరొకరికి కేటాయిస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ నంబర్‌పై ఉండే యూపీఐ ఐడీలకు సొమ్ము ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశాలు ఉంటాయని ఎన్‌పీసీఐ గుర్తించింది. కాబట్టి ఈ ఏడాది డిసెంబర్‌ 31 కల్లా థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ (TPAP), పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (PSP) సదరు యూపీఐ ఐడీలను డీయాక్టివేట్‌ చేయాలని సూచించింది. 

Password: అత్యధిక మంది వాడుతున్న పాస్‌వర్డ్‌ ఏంటో తెలుసా?

ఏడాదిగా ఆర్థిక, ఆర్థికేతర (డెబిట్‌, క్రెడిట్‌) లావాదేవీలు జరగని యూపీఐ ఐడీలను గుర్తించి, వాటిని తొలగించాలని ఎన్‌పీసీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ తరహా యూపీఐ ఐడీలు, నంబర్లు కలిగిన కస్టమర్లు ఇకపై ఎలాంటి నగదునూ అందుకోలేరు. అలాగే, అలాంటి ఫోన్‌ నంబర్లను పీఎస్‌పీలు యూపీఐ మ్యాపర్‌ నుంచి డీ-రిజిస్టర్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే, కాంటాక్ట్‌కుగానీ, ఫోన్‌ నంబర్‌కు గానీ లావాదేవీలు జరిపేటప్పుడు యాప్స్‌లో స్టోర్‌ చేసి ఉన్న పేరును కాకుండా కస్టమర్‌ను పేరును చూపించాలని ఎన్‌పీసీఐ పేర్కొంది. సురక్షితమైన నగదు లావాదేవీల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌పీసీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని