Password: అత్యధిక మంది వాడుతున్న పాస్‌వర్డ్‌ ఏంటో తెలుసా?

Password: ‘‘123456’’ను నార్డ్‌పాస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘అత్యంత వరస్ట్‌ పాస్‌వర్డ్‌’గా అభివర్ణించింది. దీన్ని హ్యాకర్లు కేవలం ఒక్క సెకన్‌లో కనిపెట్టగలరని తెలిపింది.

Published : 17 Nov 2023 15:18 IST

దిల్లీ: సైబర్‌ మోసాలు, హ్యాకింగ్‌లు పెరిగిపోతున్న నేపథ్యంలో బలమైన పాస్‌వర్డ్‌ (Password)లు పెట్టుకోవాలని టెక్‌ కంపెనీలు సూచిస్తూనే ఉన్నాయి. అయినా, యూజర్లలో పెద్దగా మార్పు లేదని తాజాగా ఓ అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌ (Password) ‘‘123456’’ అని పనామా కేంద్రంగా పనిచేస్తున్న నార్డ్‌పాస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ తెలిపింది. దీన్ని హ్యాకర్లు కేవలం ఒక్క సెకన్‌లో కనిపెట్టగలరని వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45 లక్షల అకౌంట్లకు ‘‘123456’’ అనే పాస్‌వర్డ్‌ (Password) ఉన్నట్లు స్వతంత్ర సంస్థలతో కలిసి చేసిన అధ్యయనంలో వెల్లడైనట్లు నార్డ్‌పాస్‌ తెలిపింది. అత్యధిక మంది వాడుతున్న పాస్‌వర్డ్‌ జాబితాలో ‘‘admin’’ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 40 లక్షల ఖాతాలను దీనితో యాక్సెస్‌ చేయొచ్చని తెలిపింది. ఇక ‘‘12345678’’ అత్యధిక మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌లలో మూడో స్థానంలో ఉందని వెల్లడించింది. దాదాపు 13.7 లక్షల ఖాతాలకు యూజర్లు దీన్ని పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకున్నారని తెలిపింది.

భారత్‌లో విరివిగా ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌ ‘‘123456’’ అని నార్డ్‌పాస్ వెల్లడించింది. దాదాపు 3.6 లక్షల ఖాతాలకు ఈ పాస్‌వర్డ్‌ను పొందుపర్చారని తెలిపింది. తర్వాత 1.2 లక్షల ఖాతాలకు ‘‘admin’’ పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసినట్లు వెల్లడించింది. పరిశోధన బృందాలు 6.6 టెరాబైట్ల డేటాబేస్‌ను స్టీలర్‌ మాల్వేర్ల సాయంతో యాక్సెస్‌ చేసుకొని ఈ సమాచారాన్ని పొందుపర్చినట్లు తెలిపింది. కేవలం స్టాటిస్టికల్‌ సమాచారం మాత్రమే తమకు అందిందని.. యూజర్ల వ్యక్తిగత వివరాలేవీ పరిశోధకుల బృందం తమకు ఇవ్వలేదని వెల్లడించింది.

ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్లు బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని నార్డ్‌పాస్‌ తెలిపింది. ‘‘123456’’ను కంపెనీ ‘అత్యంత వరస్ట్‌ పాస్‌వర్డ్‌’గా అభివర్ణించింది. గతంలో ఈ స్థానంలో ‘‘Password’’ అనే పదం ఉండేదని గుర్తుచేసింది. కనీసం 20 అక్షరాలతో పాస్‌వర్డ్‌ను సెట్‌ చేసుకోవాలని సూచించింది. దీంట్లో అప్పర్‌కేస్‌, లోయర్‌కేస్ ఆంగ్ల అక్షరాలు, అంకెలు, స్పెషల్‌ క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలని చెప్పింది. ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ ఖాతాలకు ఉపయోగించడం కూడా సరికాదని తెలిపింది. తరచూ సమీక్షిస్తూ.. ఎప్పటికప్పుడు మార్చుకుంటే మేలని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని