Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో 46శాతం భారత్‌లోనే: ఆర్‌బీఐ గవర్నర్‌

Digital Payments: ప్రపంచంలోని మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్‌లోనే జరుగుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. అత్యధిక మంది యూపీఐ పేమెంట్స్‌ చేస్తున్నట్లు తెలిపారు.

Updated : 04 Mar 2024 17:40 IST

ముంబయి: గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్‌ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో (Digital Payments) దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబయిలోని ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్‌ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు.

‘‘2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్‌ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ జరగ్గా.. 2023-24 నాటికి ఆ సంఖ్య 14,726 కోట్లకు పెరిగింది. అంటే గత 12 ఏళ్లలో డిజిటల్‌ చెల్లింపులు దాదాపు 90 రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో దాదాపు 46శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి’’ అని శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ఇక, ‘యూపీఐ (UPI)’ అనేది భారత్‌లోనే గాక.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన చెల్లింపు వ్యవస్థగా మారిందన్నారు.

‘‘దేశంలో డిజిటల్‌ పేమెంట్స్‌ గణనీయమైన వృద్ధి సాధించడంలో యూపీఐలదే కీలక పాత్ర. 2023లో జరిగిన ఆన్‌లైన్‌ చెల్లింపుల్లో 80శాతం వాటా దీనిదే. 2017లో 43 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2023 నాటికి ఆ సంఖ్య ఏకంగా 11,761 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రోజుకు సగటున 43 కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ పేర్కొన్నారు.

ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఇంటరాపరెబుల్‌ సిస్టమ్‌

ఆదాయపు పన్ను, బీమా ప్రీమియం, మ్యూచువల్‌ ఫండ్‌ పేమెంట్స్‌, ఈ-కామర్స్‌ వంటి వాటికి ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌తోనే చాలామంది చెల్లింపులు చేస్తుంటారు. వీటిని ప్రాసెస్‌ చేయాలంటే పేమెంట్స్‌ అగ్రిగేటర్స్‌తో బ్యాంకులు విడివిడిగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు సులువుగా ఈతరహా చెల్లింపులు చేయాలంటే అన్ని బ్యాంకులూ, అన్ని పేమెంట్స్‌ అగ్రిగేటర్ల మధ్య ఒప్పందం ఉండాలి. ఇలా అన్నింటితో ఒప్పందం కుదుర్చుకోవడం అసాధ్యం. వీటిని దృష్టిలోపెట్టుకుని ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలకు ఇంటరాపరెబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను తీసుకురానున్నట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. దీన్ని అమలుచేసేందుకు ఇప్పటికే ఎన్‌పీఐ భారత్‌ బిల్‌పే లిమిటెడ్‌ (NBBL)కు అనుమతినిచ్చినట్లు తెలిపారు. ఈ ఏడాదిలోనే ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని