Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..

Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది.

Updated : 08 Dec 2023 16:04 IST

దిల్లీ: దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) మళ్లీ మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దేశీయంగా ఉల్లి (Onion) అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. శుక్రవారం (డిసెంబరు 8) నుంచే ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడ్‌ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడ్‌ను ఎగుమతి చేసుకోవచ్చని DGFT వెల్లడించింది. అయితే, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

దేశీయ మార్కెట్లలో ఉల్లి ధరలను అదుపు చేసేందుకు ఇటీవల కేంద్రం పలుమార్లు ఎగుమతుల పాలసీని సవరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై 40శాతం కస్టమ్స్‌ సుంకాన్ని విధించింది. ఆ తర్వాత అక్టోబరులో దాన్ని సవరిస్తూ.. ఉల్లికి కనీస ఎగుమతి ధరను (MEP) 800 డాలర్లుగా నిర్ణయించింది. తాజాగా ఎగుమతులపై నిషేధం అమల్లోకి తెచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని