Indian Economy: 8 ఏళ్లలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: నిర్మలా సీతారామన్‌

Indian Economy: చాలా దేశాల ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదించిన సమయంలోనూ భారత్‌ మాత్రం వేగంగా దూసుకెళ్తున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

Published : 07 Dec 2023 17:45 IST

దిల్లీ: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. అదే సమయంలో ఇతర ఆర్థిక వ్యవస్థల వృద్ధి క్షీణిస్తోందని తెలిపారు. ఈ క్రమంలో భారత్‌ ఎనిమిదేళ్లలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరించిందని వెల్లడించారు. రాజ్యసభలో మాట్లాడుతూ గురువారం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల తయారీ రంగ కార్యకలాపాల్లో క్షీణత నమోదవుతోందని సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. అమెరికా, యూరో జోన్‌, కెనడా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాల ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తోందని తెలిపారు. కేవలం భారత్‌ (Indian Economy) మాత్రమే వేగవంతమైన వృద్ధిని నమోదు చేయగలుగుతోందని వెల్లడించారు. దేశ ఆర్థిక స్థితిగతులపై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు.

ప్రపంచంలో మూడు, నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన జపాన్‌, జర్మనీల వృద్ధి సైతం నెమ్మదించిందని సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయన్నారు. వీటితో పోలిస్తే భారత్‌ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం చాలా ప్రాధాన్యంతో కూడుకొన్న విషయమని వ్యాఖ్యానించారు. దాదాపు అన్ని రంగాలు.. ముఖ్యంగా తయారీ రంగం గణనీయ వృద్ధిని నమోదు చేస్తోందన్నారు.

మేకిన్‌ ఇండియా సహా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ ఇతర పథకాల వల్లే తయారీ రంగం దేశ జీడీపీకి గణనీయ వాటా సమకూర్చగలుగుతోందని సీతారామన్‌ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో (Indian Economy) 13.9 శాతం వాటా ఈ ఒక్క రంగానిదేనన్నారు. ప్రపంచంలో అత్యధిక దేశాలు ఎంచుకుంటున్న రెండో తయారీ గమ్యస్థానంగా భారత్‌ ఉందన్నారు. ఎగుమతులు సైతం పుంజుకుంటున్నాయన్నారు. అమెరికా స్టోర్లలో మేకిన్‌ ఇండియా ఉత్పత్తులు లభ్యమవుతున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని