Gold reserves: ‘బంగారు కొండ’ పేరుస్తున్న ఆర్‌బీఐ!

దేశంలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

Updated : 05 Apr 2024 19:01 IST

ముంబయి: గత కొన్ని నెలలుగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో భారత్‌ కూడా దీనిని భారీస్థాయిలో కొనుగోలు చేస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల స్వర్ణాన్ని (Gold reserves) సేకరించింది. విదేశీ మారక నిల్వల (Forex) విస్తరణలో భాగంగానే ఈ పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నట్లు ఆర్‌బీఐ (RBI) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. అయితే, ఎంత పరిమాణంలో కొంటున్నారనే విషయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ బంగారం నిల్వల విలువ పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేశారు.

812 టన్నుల బంగారం..

అధికారిక గణాంకాల ప్రకారం, మార్చి 2022 నాటికి విదేశీ మారక నిల్వల్లో 51.487 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం ఉంది. మార్చి 2023 నాటికి ఉన్న విలువతో పోలిస్తే 6.287 బిలియన్‌ డాలర్లు అధికం. ఇటీవల చూస్తే.. కేవలం ఒక్క జనవరిలోనే 8.7 టన్నుల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది. గతే రెండేళ్లలో ఈస్థాయిలో కొనడం ఇదే తొలిసారి. ప్రపంచ స్వర్ణ మండలి (WGC) నివేదిక ప్రకారం, ఈ జనవరి చివరి నాటికి ఆర్‌బీఐ దగ్గర ఉన్న బంగారు నిల్వలు 812.3 టన్నులకు చేరుకున్నాయి. అంతకుముందు నెలలో ఇవి 803.58 టన్నులుగా ఉన్నాయి.

రికార్డు స్థాయికి ఫారెక్స్‌..

ఇక దేశంలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించిన ఆయన.. మార్చి 29 నాటికి ఫారెక్స్‌ నిల్వలు 645.6 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయన్నారు. భవిష్యత్తులో డాలర్‌ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే.. అటువంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులోభాగంగా విదేశీ మారక నిల్వలు పెంచడంపై గత నాలుగైదేళ్లుగా దృష్టి కేంద్రీకరించామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని