Growth Rate: ప్రపంచ వృద్ధిలో భారత్‌, చైనాదే సగం వాటా: ఐఎంఎఫ్‌

క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది భారత వృద్ధిరేటు నెమ్మదిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. అయితే, అది వచ్చే సంవత్సరంలో తిరిగి పుంజుకుంటుందని తెలిపింది.

Updated : 31 Jan 2023 12:21 IST

వాషింగ్టన్‌: కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్‌ (Budget 2023) ప్రవేశపెట్టనున్న తరుణంలో ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. ఈ ఆర్థిక ఏడాది దేశ జీడీపీ (GDP) వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదవుతుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.1 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను ఐఎంఎఫ్‌ మంగళవారం విడుదల చేసింది.

ప్రపంచ వృద్ధి ఇలా..

మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఏడాది 3.4 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. వచ్చే సంవత్సరానికి అది 2.9 శాతానికి చేరుతుందని తెలిపింది. ఈ ఏడాది భారత వృద్ధి నెమ్మదించడానికి బాహ్య పరిణామాలే కారణమని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఆసియాలోని వర్ధమాన దేశాల వృద్ధిరేటు 5.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. చైనా ఆర్థిక వ్యవస్థలో కుదుపుల వల్ల 2022లో అది 4.3 శాతానికే పరిమితమైనట్లు గుర్తుచేసింది.

ప్రకాశవంతంగా భారత్‌..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాదేనని వెల్లడించింది. అదే అమెరికా, యూరోప్రాంతం కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు 1.2 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం..

మరోవైపు భారత్‌లో ద్రవ్యోల్బణం వచ్చే మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. వచ్చే ఏడాది అది మరింత తగ్గి 4 శాతంగా నమోదవుతుందని తెలిపింది. మరోవైపు ప్రపంచ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 6.6 శాతంగా, వచ్చే ఏడాది 4.3 శాతానికి తగ్గుతుందని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని