Indian Economy: ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్‌

అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది.

Published : 12 Jun 2024 03:12 IST

వచ్చే మూడేళ్లలో 6.7% వృద్ధి
మనదేశంపై ప్రపంచ బ్యాంకు అంచనా 

దిల్లీ: అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారతదేశం కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే మూడేళ్లలో 6.7% వృద్ధిరేటు సాధించే అవకాశం భారత్‌కు ఉన్నట్లు వివరించింది. 2023-24లో మనదేశం 8.2% వృద్ధి నమోదు చేసింది. ఇది అంచనాల కంటే అధికం. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిరేటు కాస్త నెమ్మదించి 6.7% వద్ద స్ధిరపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మనదేశంలో ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి అధికంగా ఉండగా, ప్రైవేటు పెట్టుబడులూ కోలుకుంటున్నట్లు వివరించింది. 

  • ఈ ఏడాది ప్రపంచ దేశాల సగటు వృద్ధి రేటు 2.6 శాతంగా ఉంటుందని, 2025-26లో 2.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. కొవిడ్‌-19 పరిణామాల ముందు దశాబ్దంలో నమోదైన ప్రపంచ వృద్ధి 3.1% కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. 
  • దక్షిణాసియా దేశాల్లో 2023 ఆర్థిక సంవత్సరంలో 6.6% సగటు వృద్ధి నమోదు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.2 శాతానికి పడిపోతున్నట్లు ప్రపంచ బ్యాంకు వివరించింది. అదే సమయంలో మనదేశం సాధిస్తున్న అధిక వృద్ధి వల్ల 2025-26లో దక్షిణాసియా దేశాల సగటు వృద్ధి రేటు 6.2%  వద్ద స్ధిరపడుతుందని పేర్కొంది. బంగ్లాదేశ్‌ కూడా ఆకర్షణీయ వృద్ధి బాటలో ఉంది. పాకిస్థాన్, శ్రీలంక నెమ్మదిగా కోలుకుంటున్నాయి. 
  • ఈ ఏడాదిలో ఆమెరికా వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంటుందన్నది ప్రపంచబ్యాంక్‌ అంచనా. ప్రజల వినియోగం, ప్రభుత్వ వ్యయం పెరగడం దీనికి ప్రధాన కారణాలని పేర్కొంది. చైనా ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకుంటోందని, ఈ ఏడాదిలో 4.8% వృద్ధి రేటు సాధించొచ్చని వివరించింది.

 ద్రవ్యోల్బణం:  2024లో ప్రపంచ వ్యాప్త సగటున ద్రవ్యోల్బణం 3.5 శాతానికి తగ్గుతుందని, 2025లో ఇది ఇంకా తగ్గి 2.9 శాతానికి పరిమితం అవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. కానీ ఇంతకు ముందు అంచనా వేసినంత వేగంగా ద్రవ్యోల్బణం దిగి రావడం లేదని పేర్కొంది. అందువల్ల వివిధ దేశాల్లో కేంద్ర బ్యాంకులు అప్రమత్తంగా ముందుకు సాగుతున్నాయని, ఫలితంగా రుణాలపై వడ్డీ రేట్లు ఇంకొంతకాలం అధికంగానే ఉంటాయని అంచనా వేసింది. భారత్‌లో ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంకు లక్ష్యమైన 4% (2 శాతం అటు,ఇటు) సమీపంలో ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని