మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినా.. పేద దేశంగానే భారత్‌!: దువ్వూరి

2029 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా అతవరించినప్పటికీ పేద దేశంగానే భారత్‌ ఉండవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

Published : 15 Apr 2024 21:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్నేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుండటంపై రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2029 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా అతవరించినప్పటికీ భారత్‌ పేద దేశంగానే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అందుకే సంబరపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సౌదీ అరేబియాను ప్రస్తావించారు. ధనిక దేశంగా మారినంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశంగా చెప్పలేమన్నారు.

‘‘నా దృష్టిలో.. అది సాధ్యమే (మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించడం). కానీ, అది సంతోష పడాల్సిన విషయం కాదు. ఎందుకంటే.. 140 కోట్ల జనాభా ఉన్నందున మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అందులో ప్రజలు ఒక అంశం మాత్రమే. ప్రజలు ఉన్నారు కాబట్టే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అయినప్పటికీ పేద దేశమే’’ అని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉందని, ఆర్థికవ్యవస్థ 4ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుందని సుబ్బారావు తెలిపారు. తలసరి ఆదాయం 2600 డాలర్లుగా ఉందని, ఇందులో భారత్‌ 139వ స్థానంలో ఉందన్నారు. బ్రిక్స్‌, జీ-20 దేశాల్లో పేద దేశంగా నిలుస్తోందన్నారు. ముందుకు వెళ్లేందుకు అజెండా స్పష్టంగా ఉందని, వృద్ధి రేటును పెంచడంతోపాటు ప్రయోజనాలు అందరికీ పంచాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని ప్రస్తావించారు. ఇది సాధించాలంటే స్వతంత్ర సంస్థలు, పారదర్శకత, బలమైన ప్రభుత్వం, చట్టబద్ధమైన పాలన ఉండాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని