యంగ్‌ ఇండియాది విరాట్‌ కోహ్లీ మనస్తత్వం: రఘురామ్‌ రాజన్‌

డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌ కారణంగా రావాల్సిన ప్రయోజనాలను భారత్‌ అందుకోలేకపోతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 14:58 IST

వాషింగ్టన్‌: డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌ కారణంగా కలిగే ప్రయోజనాలను భారత్‌ పొందలేకపోతోందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ (Raghuram Rajan) అన్నారు. యువతలో నైపుణ్యాల మెరుగుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశం మొత్తం జనాభాలో పనిచేయని వారితో పోలిస్తే పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాన్ని డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌గా పేర్కొంటారు.

జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్సిటీలో ‘మేకింగ్‌ ఇండియా యాన్‌ అడ్వాన్స్‌ ఎకానమీ బై 2047’ అంశంపై నిర్వహించిన సదస్సులో రఘురామ్‌ రాజన్‌ మాట్లాడారు. డెమోగ్రఫిక్‌ డివిడెండ్‌ వల్ల కలిగే ప్రతిఫలాలు పొందడంలో మనం మధ్య స్థాయిలోనే ఉన్నామన్నారు. ఈవిషయంలో చైనా, కొరియా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందాయని గుర్తు చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు.

ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం

మన వద్ద ఉన్న మానవ వవనరుల సామర్థ్యాలను కొంతైనా మెరుగుపరచడం, అందుబాటులో ఉన్న ఉద్యోగాల స్వభావాన్ని పాక్షికంగా మార్చడం వంటి అంశాలపైన పని చేయాల్సిన అవసరం ఉందని రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ‘‘అప్రంటీస్‌షిప్‌ దీనికి మంచి ఆలోచన. కాంగ్రెస్‌ ఈ అంశాన్ని తన మేనిఫెస్టోలో పెట్ట్టింది. అయితే దానికి ఇంకా మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది’’ అని రాజన్‌ అన్నారు. చిప్‌ తయారీపై భారత్‌ బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయడాన్ని తప్పబట్టారు. ఇందులో చాలావరకు వ్యయం సబ్సిడీలకే పోతుందని చెప్పారు. 

మన దేశానికి చెందిన చాలామంది ఆవిష్కర్తలు సింగపూరో, సిలికాన్‌ వ్యాలీనో తరలిపోవడానికి కారణమేంటన్న ఓ ప్రశ్నకు రాజన్‌ బదులిచ్చారు. అందుకుగల కారణాలను వారినే అడగాల్సిన అవసరం ఉందన్నారు. చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచాన్ని మార్చాలన్న దృక్పథంతో ఉంటున్నారని, కాని, వారు మన దేశంలో ఉండేందుకు మాత్రం ఇష్టపడడం లేదన్నారు. యంగ్‌ ఇండియా మనస్తత్వాన్ని విరాట్‌ కోహ్లీతో పోల్చారు. పరోక్షంగా కోహ్లీలా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలనుకుంటున్నారని చెప్పారు. దేశంలో దశాబ్దాలుగా నిరుద్యోగ సమస్య పెరుగుతూ వస్తోందన్నారు. దీన్ని విస్మరిస్తే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని హెచ్చరించారు. పీహెచ్‌డీ చేసినవారు సైతం రైల్వేలో ప్యూన్‌ జాబ్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని రాజన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని