IRDAI: ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం

IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. 

Published : 17 Apr 2024 00:04 IST

Health Insurance Claim Rules | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆరోగ్య బీమాకు సంబంధించి బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక మార్పులు చేసింది. ఆరోగ్య బీమా క్లెయిములకు సంబంధించిన నిబంధనలను సవరించింది. ముందస్తు వ్యాధుల వెయిటింగ్‌ పీరియడ్‌, మారటోరియం పీరియడ్‌లను తగ్గించింది. దీంతో ఆరోగ్య బీమా కొనుగోలు చేసినవారికి మరింత ప్రయోజనం చేకూరనుంది.

బీమా కొనుగోలు చేసే సమయంలో పాలసీ తీసుకుంటున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తారు. పాలసీ కవరేజీ ప్రారంభం కావడానికి కొంతకాలం వెయింటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. ఈలోపే ఏవైనా అనారోగ్య సమస్యలు (PED) తలెత్తి  బీమా తీసుకున్న వ్యక్తి ఆస్పత్రి పాలైతే అతనికి ఎలాంటి కవరేజీ లభించదు.  దీన్నే పీఈడీ వెయిటింగ్‌ పీరియడ్‌ అంటారు. ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న వెయిటింగ్‌ పీరియడ్‌ను ఇప్పుడు 3 సంవత్సరాలకు ఐఆర్‌డీఏఐ తగ్గించింది. దీనివల్ల బీమా తీసుకునేవారికి ప్రయోజనం కలుగుతుంది. విదేశీ ప్రయాణ పాలసీలకు ఈ నిబంధన వర్తించదు.

ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌.. ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు

ఆరోగ్య బీమాకు సంబంధించి మారటోరియం పీరియడ్‌ను కూడా ఐఆర్‌డీఏఐ సవరించింది. యాక్టివ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ మారటోరియం వ్యవధిని 8 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించింది. అంటే పాలసీ కొనుగోలు చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు క్రమంతప్పకుండా ప్రీమియం చెల్లించినట్లయితే పాలసీ ఒప్పందం ప్రకారం అన్ని క్లెయిమ్‌లను ఈ నిబంధన కింద బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. 

ఆరోగ్య బీమా పాలసీ ప్రారంభించినప్పటి నుంచి 36 నెలల వరకు కొన్ని వ్యాధులు, చికిత్సలపై ఎలాంటి కవరేజీ ఉండదు. దీన్నే నిర్దిష్ట వెయిటింగ్ పీరియడ్ అంటారు. ప్రమాదాలు జరిగిన సమయంలో దీనికి మినహాయింపు ఉంటుంది. ఈ కాల వ్యవధి ముగిసిన తర్వాత పాలసీలో పేర్కొన్న చికిత్సలపై కవరేజీ పొందొచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 4 సంవత్సరాలుగా ఉంది. దీన్ని తాజాగా మూడేళ్లకు తగ్గించారు. నిర్దిష్ట వెయిటింగ్‌ పీరియడ్‌లోకి వచ్చే వ్యాధులు, చికిత్సల వివరాలను బీమా పాలసీని కొనుగోలు చేసినప్పుడే బీమా సంస్ధలు అందిస్తాయి. ఐఆర్‌డీఏఐ చేపట్టిన ఈ మూడు మార్పులు కొత్తగా బీమా తీసుకోనున్న వారితో పాటు, ఇప్పటికే పాలసీ తీసుకున్న వారికి వర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని