Indian Economy: 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌: ఎస్‌అండ్‌పీ

Indian Economy: వచ్చే కొన్నేళ్లపాటు భారత్‌ మెరుగైన వృద్ధిరేటు నమోదు చేస్తుందని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. ఈ క్రమంలో దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపింది.

Updated : 05 Dec 2023 13:52 IST

దిల్లీ: భారత్‌ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ‘ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌’ అంచనా వేసింది. 2023- 24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది ఇది 6.9 శాతానికి, 2026-27 నాటికి ఏడు శాతానికి చేరుతుందని లెక్కగట్టింది. ఈ క్రమంలో 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ (Indian Economy) నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.

వచ్చే మూడేళ్లలో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. ప్రస్తుతం మన దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మన కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్‌ ఉన్నాయి. అతిపెద్ద తయారీ కేంద్రంగా నిలవడమే ఇప్పుడు భారత్‌ ముందున్న సవాల్‌ అని ఎస్‌అండ్‌పీ చెప్పింది. ఇది దేశానికి ఒక పెద్ద అవకాశమని పేర్కొంది.

సేవల ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి భారత్‌ను తయారీ కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందని ఎస్‌అండ్‌పీ నివేదిక అభిప్రాయపడింది. దీనికి బలమైన లాజిస్టిక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ అవసరమని పేర్కొంది. మరోవైపు భారత శ్రామిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని ఇంకా వెలికితీయాల్సి ఉందని వెల్లడించింది. అందుకోసం కార్మికులు, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని సూచించింది. మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపింది.

వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్.. రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశ స్టార్టప్‌ వ్యవస్థ విస్తరణకు ఉపకరిస్తుందని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక, వినియోగదారు ఆధారిత సాంకేతికతల వృద్ధికి ఇది దోహదం చేస్తుందని చెప్పింది. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణల నేపథ్యంలో దేశ వాహన రంగం వృద్ధి దశలో ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని