India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493

India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది.

Updated : 08 Dec 2023 13:26 IST

దిల్లీ: గృహ రుణాలు అందించే ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ ఐపీఓ (India Shelter Finance IPO) డిసెంబర్‌ 13న ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 15 వరకు షేర్లకు బిడ్లు దాఖలు చేయొచ్చు. ఐపీఓ షేరు ధరల శ్రేణిని రూ.469-493గా నిర్ణయించారు. గరిష్ఠ ధర వద్ద మొత్తం రూ.1,200 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ ఐపీఓ (India Shelter Finance IPO)లో రూ.800 కోట్ల విలువ చేసే కొత్త షేర్లను ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ జారీ చేయనుంది. మరో రూ.400 కోట్ల విలువ చేసే షేర్లను ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద అందుబాటులో ఉంచుతున్నారు. క్యాటలిస్ట్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌, మ్యాడిసన్‌ ఇండియా ఆపర్చునిటీస్‌-IV, నెక్సస్‌ వెంచర్స్‌ III లిమిటెడ్‌, నెక్సస్‌ ఆపర్చునిటీ ఫండ్‌ II లిమిటెడ్‌, ఎంఐఓ స్టారాక్‌ ప్రమోటర్లు తమ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో విక్రయిస్తున్నారు.

ఈ ఐపీఓ (India Shelter Finance IPO) ద్వారా సమకూరిన నిధులను ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌ తమ భవిష్యత్‌ మూలధన అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది. తాజా పబ్లిక్‌ ఇష్యూలో అందుబాటులో ఉన్న షేర్లలో సగం వరకు అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులకు, 35 శాతం రిటైల్‌ మదుపర్లకు, 15 శాతం సంస్థాగతేతర మదుపర్లకు కేటాయించారు. ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 30 షేర్లకు (ఒక లాట్‌) బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గరిష్ఠ ధర వద్ద రూ.14,790 పెట్టుబడిగా పెట్టాలి.

వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్, నెక్సస్‌ వెంచర్‌ పార్ట్‌నర్స్‌ మద్దతు ఉన్న ఇండియా షెల్టర్‌ ఫైనాన్స్‌.. రిటైల్‌ గృహ రుణాలు జారీ చేస్తుంటుంది. ఈ కంపెనీకి బలమైన టెక్నాలజీ మౌలిక వసతులు, విస్తృత పంపిణీ నెట్‌వర్క్‌ ఉంది. స్వయం ఉపాధి కస్టమర్లే లక్ష్యంగా ఇది సేవలందిస్తోంది. అల్ప, మధ్యాదాయ వర్గాల్లో తొలిసారి గృహ రుణం తీసుకుంటున్న వారిపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. టైర్‌-II, టైర్‌-III పట్టణాల్లో ప్రధానంగా ఈ కంపెనీ కార్యకలపాలు విస్తరించాయి. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, యాంబిట్‌ ఈ ఐపీఓకి బుక్‌-రన్నింగ్‌ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని