Stock Market: మార్కెట్లకు స్వల్ప లాభాలు.. 22వేలు దాటిన నిఫ్టీ

Stock Market closing Bell: వరుసగా మూడో రోజు స్టాక్‌ మార్కెట్లకు లాభాలు దక్కాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 190 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22వేల మార్క్‌ దాటింది.

Published : 22 Mar 2024 15:56 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) శుక్రవారం తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ సూచీలపై ప్రభావం చూపించాయి. అటు ఐటీ షేర్లలో నష్టాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. దీంతో రోజంతా ఊగిసలాడిన సూచీలు.. చివరకు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి. సెన్సెక్స్‌ (Sensex) 190 పాయింట్లు ఎగబాకగా.. నిఫ్టీ (Nifty) 22వేల మార్క్‌ పైన స్థిరపడింది.

ఈ ఉదయం 72,231 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ (BSE) కాసేపటికే 72,172 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత కాస్త కోలుకున్న సూచీ ఒక దశలో 73వేల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత మళ్లీ అమ్మకాల ఒత్తిడికి గురైంది. చివరకు 190.75 పాయింట్ల లాభంతో 72,831.94 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ (NSE) 84.80 పాయింట్లు లాభపడి 22,096.75 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి 83.47గా ముగిసింది.

లోహ, ఆటో, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌ రంగాల సూచీలు రాణించాయి. ఐటీ షేర్లు 2 శాతానికి పైగా కుంగాయి. నిఫ్టీలో యూపీఎల్‌, మారుతీ సుజుకీ, హీరో మోటార్స్‌, బజాజ్‌ ఆటో, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. విప్రో, ఇన్ఫోసిస్‌, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌ షేర్లు నష్టపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని