Stock Market: బ్యాంక్‌ షేర్లు పడేశాయ్‌.. నష్టాలతో ముగిసిన సూచీలు

Stock Market Closing Bell: నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 523 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 166 పాయింట్లు పతనమైంది.

Published : 12 Feb 2024 16:03 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు (Stock Market) సోమవారం నష్టాలు చవిచూశాయి. దిగ్గజ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు సూచీలను పడగొట్టాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, పెద్దగా ప్రభావం చూపే అంశాలు లేకపోవడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్‌ (Sensex) ఏకంగా 500 పాయింట్లకు పైగా దిగజారగా.. నిఫ్టీ (Nifty) 166 పాయింట్లు కోల్పోయింది.

క్రితం సెషన్‌ నాటి ముగింపు (71,595.49)తో పోలిస్తే.. ఈ ఉదయం సెన్సెక్స్‌ 71,722 వద్ద స్వల్ప లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే, బ్యాంకింగ్‌తో పాటు ఇతర రంగాల్లో ప్రధాన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఒక దశలో 70,922.57 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 523 పాయింట్లు దిగజారి 71,072.49 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 166.50 పాయింట్లు పతనమై 21,616 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి రూ.83గా ఉంది.

ఐటీ, హెల్త్‌కేర్‌ మినహా దాదాపు అన్నిరంగాల సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, లోహ, చమురు రంగ సూచీలు 1-4 మేర కుంగాయి. నిఫ్టీలో కోల్‌ ఇండియా, హీరో మోటార్స్‌, భారత్‌ పెట్రోలియం, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ షేర్లు నష్టపోగా.. రెడ్డీస్‌ ల్యాబ్స్‌, అపోలో హాస్పిటల్స్‌, విప్రో, దివిస్ ల్యాబ్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు స్వల్ప లాభాలను దక్కించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని