M-cap: 4లక్షల కోట్ల డాలర్లకు మదుపర్ల సంపద.. ఈ మార్క్‌ దాటిన ఐదో మార్కెట్‌ భారత్‌

M-cap: బీఎస్‌ఈ (BSE)లోని నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2007 మే 28న తొలిసారి 1 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయిని దాటింది.

Published : 29 Nov 2023 13:19 IST

ముంబయి: దేశంలోని ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన బీఎస్‌ఈ (BSE)లో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ (Market Capitalisation) తొలిసారి నాలుగు ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (Sensex) సూచీ బుధవారం ఉదయం ఓ దశలో 305.44 పాయింట్లు పెరిగి 66,479.64కు చేరడంతో ఈ సరికొత్త రికార్డు నమోదైంది. రూ.83.31 మారకం విలువ దగ్గర నాలుగు ట్రిలియన్‌ డాలర్ల విలువ భారత కరెన్సీలో రూ.3,33,26,881.49 కోట్లకు సమానం.

ఈ ఏడాది ఇప్పటి వరకు బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్‌ (Sensex) 5,540.52 పాయింట్లు (9.10%) ఎగబాకింది. ఫలితంగా మదుపర్ల సంపదగా చెప్పే నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ (Market Capitalisation) రూ.50.81 లక్షల కోట్లు పెరిగింది. సెప్టెంబర్‌ 15న సెన్సెక్స్‌ 67,927.23 పాయింట్ల దగ్గర జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. ఇప్పటి వరకు నాలుగు ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ దాటిన జాబితాలో అమెరికా, చైనా, జపాన్‌, హాంకాంగ్ మార్కెట్లు మాత్రమే ఉన్నాయి.

బీఎస్‌ఈ (BSE)లోని నమోదిత సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2007 మే 28న తొలిసారి 1 ట్రిలియన్‌ డాలర్ల మైలురాయి దాటింది. తర్వాత 2014 జూన్‌ 6న 1.5 ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకుంది. 0.5 ట్రిలియన్‌ డాలర్లు పెరగడానికి 2,566 రోజులు పట్టింది. అనంతరం 1,130 రోజుల తర్వాత 2017 జులై 10న రెండు ట్రిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరింది. 2020 డిసెంబర్‌ 16న 2.5 ట్రిలియన్‌ డాలర్లు.. 2021 మే 24న మూడు ట్రిలియన్‌ డాలర్ల మార్క్‌ను అందుకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు