ప్రస్తుత కంపెనీలకూ ప్రోత్సాహకాలు!

విద్యుత్‌ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది.

Published : 18 May 2024 01:09 IST

విద్యుత్‌ వాహన నూతన విధానానికి త్వరలో మార్గదర్శకాలు

దిల్లీ: విద్యుత్‌ వాహన (ఈవీ) నూతన విధానాన్ని అనుసరించి, పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న సంస్థలకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన కసరత్తు నడుస్తోందని, త్వరలోనే సంబంధిత వర్గాలతో రెండో దశ సంప్రదింపులు నిర్వహించనున్నట్లు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత నెలలో ఈ మంత్రిత్వ శాఖ తొలి విడత చర్చలను నిర్వహించింది. మార్గదర్శకాల్లో దరఖాస్తు విధానం, సంబంధిత పోర్టల్‌ లింకులు, ప్రాజెక్టు పర్యవేక్షణ ఏజెన్సీ (పీఎంఏ) గురించి సమాచారం ఉంటుందని ఆ అధికారి పేర్కొన్నారు. పెట్టుబడులకు సంబంధించి ప్రోత్సాహకాలు పొందేందుకు దేశీయ వాహన సంస్థలు ఈ పాలసీ కింద దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్లాంటు ఏర్పాటుకు పెట్టుబడి పెడుతున్న సంస్థలు, నిర్దిష్ట సంఖ్యలో ఈవీలను దిగుమతి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ అర్హత సాధించేందుకు ఎంత పెట్టుబడులు పెడుతున్నారనేది తమకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశంలో ఇప్పటికే ఉన్న కంపెనీలు ఈవీ పాలసీ కింద దరఖాస్తు చేసుకునేందుకు కొత్త అనుబంధ సంస్థను నమోదు చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘కొత్త పెట్టుబడులు రావాలి. సంస్థ కొత్తది కావాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. ఈ పాలసీని ప్రకటించడానికి ముందే ఈవీ కంపెనీల్లో పెట్టుబడి ప్రారంభించిన సంస్థలూ, నూతన విధానం కింద ప్రోత్సాహకాలను పొందేందుకు వీలుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని